పకడ్బందీగా జన గణన నిర్వహణ: కలెక్టర్ ఖుష్బూ గుప్తా

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: జనగణనలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Khushboo Gupta) అన్నారు. మంగళవారం జన గణనపై జిల్లా, డివిజనల్ స్థాయి అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు నిర్వహించిన రెండు రోజుల శిక్షణ తరగతుల కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని దిశా నిర్దేశం చేశారు. జన గణన రెండో దశ షెడ్యూల్, విధివిధానాలు, అధికారుల బాధ్యతల గురించి వివరించారు. జన గణన రెండో దశను 2027 జనవరి 10వ తేదీ నుంచి ఫిబ్రవరి 28 వరకు నిర్వహించాలన్నారు. సెన్సస్ డైరెక్టరేట్ సూచించిన ప్రకారం, స్వీయ గణన 2027 జనవరి 10 నుంచి జనవరి 24 వరకు, జన గణన జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు, ఫిబ్రవరి 28న ఇళ్లు లేని వారిని గుర్తించాలన్నారు. రివిజనల్ రౌండ్ మార్చి 1 నుంచి మార్చి 5 వరకు జరుగుతుందన్నారు.

40 ప్రశ్నలతో జన గణన..

జన గణనలో భాగంగా ఎన్యుమరేటర్లు ప్రతి గృహ యజమానిని సంప్రదించి మొత్తం 40 ప్రశ్నలకు సంబంధించిన వివరాలను సేకరిస్తారని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. ప్రజలు ఎన్యుమరేటర్లకు సరైన సమాచారాన్ని అందించి జనాభా గణన విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. స్వీయ గణనలో జిల్లాలో గ్రామ పంచాయతీ వారీగా పంచాయతీ కార్యదర్శులు చొరవ తీసుకుని నిర్వహించాలని అన్నారు.

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ మాట్లాడుతూ.. జిల్లాలో మొదటి దశ జనగణన హౌస్ లిస్టింగ్ సర్వే విజయవంతం చేసినట్లే రెండవ దశ జనగణన కూడా విజయవంతం చేయాలని కోరారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్.బి.హరిప్రియ మాట్లాడుతూ.. డిజిటల్ పద్ధతిలో మొబైల్ యాప్ ద్వారా వివరాలు నమోదు చేయనున్నట్లు తెలిపారు. జన గణనపై వివరాల సేకరణకు పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ సాయి శివాని, జడ్పీ సీఈవో వెంకటరెడ్డి, ఆర్డీవో నవీన్, జిల్లా విద్యా శాఖ అధికారి విజయకుమారి, సీపీవో నర్సింహులు, ట్రైనర్లు దయానంద్, శివరామ కృష్ణ హాజరయ్యారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>