కలం, నిజామాబాద్ బ్యూరో: సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకూ కీలకంగా మారుతోందని.. ముఖ్యంగా ఏఐతో ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు సామాజిక సమస్యలపే పరిష్కరించే అవకాశం ఉందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని IT టవర్స్‌లో ఎన్.ఎన్. ఏఐ సొల్యూషన్స్ హ్యాకథాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన “NN 2026 – కోడ్ ఫర్ ఛేంజ్” కార్యక్రమానికి సీపీ సాయి చైతన్య ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. హ్యాకథాన్‌లో పాల్గొన్న విద్యార్థులు, యువత, టెక్నాలజీ నిపుణులతో ముచ్చటిస్తూ వారు రూపొందించిన ఏఐ టూల్స్, వినూత్న ఆలోచనలు, ప్రాజెక్టులు సమస్యల పరిష్కార విధానాలను పరిశీలించారు.
సరైన దిశలో వినియోగిస్తే..
సృజనాత్మకత, ఆలోచనా శక్తి, సాంకేతిక నైపుణ్యాలను సరైన దిశలో వినియోగిస్తే సమాజానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని సీపీ సాయి చైతన్య తెలిపారు. “కోడ్ ఫర్ ఛేంజ్” వంటి కార్యక్రమాలు యువతను సాంకేతిక రంగంలో మరింత ప్రోత్సహిస్తాయన్నారు. పోలీసింగ్ వ్యవస్థలో కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ప్రజా భద్రత, నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, డేటా విశ్లేషణలో ఉపయోగపడుతోందన్నారు. యువత సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకోవడమే కాకుండా దానిని ప్రజా ప్రయోజనం, సమాజ శ్రేయస్సుకు వినియోగించాలని పోలీస్ కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమంలో సీఈవో నజీబ్, మేనేజర్ షేక్ సబ్బార్, కాకతీయ కాలేజీ ప్రిన్సిపల్ రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

