భక్తుల భద్రతే లక్ష్యం.. నిమజ్జన ఏర్పాట్లపై పెద్దపల్లి పోలీసుల కసరత్తు!

కలం, పెద్దపల్లి: వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు పెద్దపల్లి పోలీసుల ఆధ్వర్యంలో పట్టణంలోని డీసెంట్ ఫంక్షన్ హాల్‌లో వినాయక మండపాల నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులు, సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి పెద్దపల్లి డీసీపీ (Peddapalli DCP) బి. రామ్ రెడ్డి (B Ram Reddy) ,పెద్దపల్లి ఏసీపీ జి.కృష్ణ, పోలీస్ అధికారులు, తహశీల్దార్, మున్సిపల్ కమిషనర్, విద్యుత్ శాఖ అధికారులు, ఇరిగేషన్ శాఖ ఏఈఈ, మత్స్యశాఖ, వైద్య ఆరోగ్య శాఖ, ఆర్‌ అండ్ ‌బీ శాఖ అధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. వినాయక నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా ప్రజలు, భక్తులు, మండపాల నిర్వాహకులు పోలీసులకు పూర్తిగా సహకరించాలని సూచించారు. నిమజ్జన కార్యక్రమం సజావుగా జరిగేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, పోలీసులు సూచించే భద్రతా నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.

మండపాల నిర్వాహకులు నిమజ్జన శోభాయాత్ర సమయంలో క్రమశిక్షణ పాటించాలని, నిర్ణయించిన మార్గాలు, నిబంధనలకు అనుగుణంగా శోభాయాత్ర నిర్వహించాలని సూచించారు. ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు.

మినీ ట్యాంక్‌బండ్ నిమజ్జన ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు

సమావేశం అనంతరం డీసీపీ బి. రామ్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులు మినీ ట్యాంక్‌బండ్ నిమజ్జన ప్రాంతాన్ని సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. నిమజ్జనం సందర్భంగా భక్తులు ప్రమాదవశాత్తు నీటిలోకి వెళ్లకుండా అవసరమైన బారికేడింగ్, విద్యుత్ దీపాల ఏర్పాటు, పోలీస్ బందోబస్తు, రాకపోకల నియంత్రణ, విద్యుత్ భద్రత తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.

అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా రక్షణ చర్యలు చేపట్టడంతో పాటు అవసరమైన సిబ్బంది, ఇతర సౌకర్యాలను అందుబాటులో ఉంచాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. నిమజ్జన సమయంలో భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల నిలుపుదల, రాకపోకలు, అత్యవసర వాహనాలకు మార్గం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

నిమజ్జన ప్రాంతంలో ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులు తెలిపారు. వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలు, భక్తులు, మండపాల నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా అన్ని శాఖల సమన్వయంతో నిమజ్జన ఏర్పాట్లు చేపడుతున్నట్లు డీసీపీ తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>