కలం, నిజామాబాద్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) రాజ్యసభ నామినేషన్ తిరస్కరణను నిజామాబాద్ (Nizamabad) జిల్లా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. జిల్లా అధ్యక్షుడు నగేష్ రెడ్డి (Nagesh Reddy) మాట్లాడుతూ, మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణలో ఎలాంటి కేసులు లేవని, కోర్టు నుండి ఎలాంటి నోటీసులు కూడా అందలేదని తెలిపారు. ఎవరో ఇచ్చిన లేఖ ఆధారంగా స్క్రూటినీ పేరుతో నామినేషన్ తిరస్కరించడం సరైంది కాదని ఆయన విమర్శించారు. మీనాక్షి నటరాజన్ గాంధేయవాదంతో నడిచే నాయకురాలని, వ్యక్తిగతంగా ఎవరి గురించి కూడా విమర్శించని స్వభావం కలిగినవారని కొనియాడారు.
రాజ్యసభలో ఆమె ఉంటే ప్రతిపక్షంగా నిర్మాణాత్మక పాత్ర పోషించి, ప్రభుత్వ లోపాలను సూచించే నాయకురాలని అన్నారు. అయితే బీజేపీ అన్యాయంగా ఆమె నామినేషన్‌ను తిరస్కరించిందని ఆరోపించారు. దేశ ప్రజలు ఈ పరిణామాలను గమనిస్తున్నారని, రాబోయే రోజులలో తగిన సమాధానం ఇస్తారని వ్యాఖ్యానించారు. ఇక జిల్లాలో యూరియా కొరతపై వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వాస్తవానికి జిల్లాలో యూరియా కొరత లేదని స్పష్టం చేశారు. ఖరీఫ్ పంటకు అవసరమైన యూరియాను దశలవారీగా అందిస్తున్నామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. సేంద్రీయ వ్యవసాయం ప్రాముఖ్యతను కూడా గుర్తుచేస్తూ, రైతులు సహజ ఎరువుల వినియోగంపై దృష్టి పెట్టాలని సూచించారు.

