కలం, వెబ్ డెస్క్ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముఖరా-K గ్రామం మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి రకంగా గుర్తింపు పొందిన ‘మియాజాకి’ మామిడి పండ్లు (Miyazaki Mango) ఇప్పుడు ఈ గ్రామంలో దర్శనమిస్తున్నాయి. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి నాలుగేళ్ల క్రితం గ్రామంలో 500 మామిడి మొక్కలను నాటారు. వాటిలో ఐదు మియాజాకి రకానికి చెందిన మొక్కలు కూడా ఉన్నాయి.
ఈ మొక్కలను ఆమె ప్రత్యేక శ్రద్ధతో పెంచగా, తాజాగా అవి తొలి కాతకు వచ్చాయి. ప్రస్తుతం ఆ చెట్లకు కాసిన అరుదైన మియాజాకి మామిడి పండ్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ రకం మామిడి పండ్ల ధర కిలో రూ.2.5 లక్షల నుండి రూ.2.8 లక్షల వరకు పలుకుతుందని గాడ్గే మీనాక్షి ఈ సందర్భంగా వెల్లడించారు. తెలంగాణలోని ఒక పల్లెటూర్లో ఇంతటి ఖరీదైన, అరుదైన పంట పండటం విశేషం.

