ఎల్‌నినో ఎఫెక్ట్.. నీటి వృథాపై కలెక్టర్ వార్నింగ్

కలం, నిజామాబాద్ బ్యూరో : తాగునీటిని వృథా చేస్తే జరిమానాలు విధించాలని నిజామాబాద్ (Nizamabad) కలెక్టర్ ఇలా త్రిపాఠి(Ila Tripathi) అధికారులను ఆదేశించారు. మున్సిపల్ పట్టణ ప్రాంతాలలో రూ.10 వేలు, గ్రామ పంచాయతీల పరిధిలో రూ.5 వేల వరకు జరిమానా విధించాలని సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం తాగునీటి సరఫరా, సాగునీటి లభ్యత, భూగర్భ జలాల పెంపుదల అంశాలపై కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని నిజాంసాగర్, శ్రీరాంసాగర్ రిజర్వాయర్లలో నీటి నిల్వలు, తాగు, సాగునీటి అవసరాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో(El Nino Effect) ఈసారి వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున అందుబాటులో ఉన్న నీటి వనరులను జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. తాగునీటిని ఎట్టి పరిస్థితులలోనూ  వృథా చేయకుండా పకడ్బందీ పర్యవేక్షణ చేపట్టాలని అధికారులకు సూచించారు. తాగునీటిని భవన నిర్మాణాలు, ఇతర అవసరాలకు మళ్లించకుండా చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా వృథా చేస్తే బాధ్యులపై జరిమానాలు విధించాలని స్పష్టం చేశారు. అన్ని నివాస ప్రాంతాలకు సరిపడా రక్షిత మంచినీరు అందేలా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు అన్ని ప్రాంతాలలో తాగునీటి సరఫరా పరిస్థితిని పరిశీలించి సంయుక్త నివేదిక సమర్పించాలని కలెక్టర్ సూచించారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచేందుకు అవసరమైన ప్రాంతాలలో  ఫామ్ పాండ్లు, వాటర్‌షెడ్ నిర్మాణాలు చేపట్టాలని తెలిపారు. నీటి వనరులు తక్కువగా ఉన్న ప్రాంతాలు, భూగర్భ జలాల మట్టాలు పడిపోయిన ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అలాగే ఖరీఫ్ పంటల సాగుకు అవసరమైన మొదటి, రెండో తడుల నీటి సరఫరాపై ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వి. భుజంగరావు, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, డీఆర్‌డీఓ సాయన్న, డీపీఓ శ్రీనివాస్ రావు, నీటిపారుదల శాఖ అధికారి ప్రకాశ్, ఆర్‌డబ్ల్యూఎస్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>