కలం, నిజామాబాద్ బ్యూరో : పోలీసు శాఖలో పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ కోసం (Police Recruitment) ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన దృష్ట్యా నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ (Nizamabad) కలెక్టర్ భవేష్ మిశ్రా(Collector Bhavesh Mishra) సూచించారు. పోలీస్ శాఖలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులలో సుమారు 200 మందిని ఎంపిక చేసి, జిల్లా యంత్రాంగం తోడ్పాటుతో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రీ-రిక్రూట్‌మెంట్ ట్రైనింగ్ ఏర్పాటు చేశారు.
ఉద్యోగార్థులకు భోజన వసతిని సమకూరుస్తూ రెండు నెలల పాటు నిష్ణాతులచే థియరీ, దేహదారుడ్య పరీక్షలలో ఉత్తమ ప్రతిభ చాటేలా శిక్షణ అందిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన భాగ్యకిరణ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో అనుభవజ్ఞులైన అధ్యాపకులు , నిపుణులచే అభ్యర్థులకు మెళకువలు నేర్పిస్తూ, అన్ని విధాలుగా సన్నద్ధం చేసేలా చర్యలు తీసుకున్నారు.
ఏకాగ్రత, పట్టుదలతో లక్ష్య సాధన
నిజామాబాద్ (Nizamabad) గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో కొనసాగుతున్న ప్రీ రిక్రూట్ మెంట్ శిక్షణ(Pre-recruitment training) శిబిరాన్ని పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్యతో కలిసి కలెక్టర్ భవేష్ మిశ్రా బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ భవేష్ మిశ్రా అభ్యర్థులకు విలువైన సలహాలు, సూచనలు అందించారు.
రీజనింగ్ ఎబిలిటీ, ఆంగ్లం, గణితం అంశాలలో ఎక్కువ మార్కులు సాధించడానికి పాటించాల్సిన పద్ధతుల గురించి మెళకువలు తెలియజేశారు. ఉద్యోగార్థులకు తానే స్వయంగా నైపుణ్య సామర్ధ్య పరీక్షలు నిర్వహించి, గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ప్రభుత్వ ఉద్యోగాలకు విపరీతమైన పోటీ నెలకొని ఉన్న ప్రస్తుత తరుణంలో ఏకాగ్రత, పట్టుదలతో ప్రణాళికాబద్దంగా కృషి చేస్తేనే కొలువు సాధించగల్గుతారని సూచించారు.
సెల్ ఫోన్, సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలి
గమ్యాన్ని చేరుకునే వరకు నిరంతర ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ధృడ సంకల్పంతో ముందుకు వెళ్లాలని మార్గనిర్దేశం చేశారు. ప్రపంచంలో అసాధ్యం అన్నది ఏదీ లేదని, సరైన ప్రణాళిక, కష్టపడే తత్వం, సానుకూల దృక్పథంతో కూడిన కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చని ఉద్యోగార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందింపజేశారు. రెండు నెలల పాటు సెల్ ఫోన్, సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని, ముందస్తు శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు.
అంకితభావం, పట్టుదల, ఏకాగ్రతతో చదువుతూ ఉచిత శిక్షణ తరగతులను కొలువుల సాధనకు అనుకూలంగా మలచుకోవాలని సూచించారు. అనవసర భయాలను విడనాడి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని, నిరంతర సాధన ద్వారా పోలీస్ రిక్రూట్ మెంట్ పరీక్షలో మెరుగైన ఫలితాలు సాధించేలా సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్ స్థాయి కోచింగ్‌కు దీటుగా శిక్షణ
పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య (Sai Chaitanya)మాట్లాడుతూ..హైదరాబాద్‌లో అందించే కోచింగ్‌కు ఏమాత్రం తక్కువ కాకుండా మరింత మెరుగైన మెటీరియల్‌తో పాటు, నిష్ణాతులైన ఫ్యాకల్టీచే స్థానికంగా శిక్షణ తరగతులు ఏర్పాటు చేయించామని చెప్పారు. ప్రీరిక్రూట్ మెంట్ ట్రైనింగ్ కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం తరపున కలెక్టర్ అన్ని విధాలుగా తోడ్పాటును అందించారని జిల్లా పోలీస్ శాఖ తరపున కృతజ్ఞతలు తెలిపారు.
నిరుద్యోగ యువతకు సరైన మార్గదర్శకత్వం అందించడం పోలీస్ శాఖ సామాజిక బాధ్యతలో భాగమని తెలిపారు. అర్హత కలిగిన సమర్ధవంతులైన అభ్యర్థులు పోలీస్ ఉద్యోగాలను సాధించి, ప్రజలకు సేవలందించాలనే సంకల్పంతో జిల్లా యంత్రాంగం సహకారంతో ఈ ఉచిత ప్రీ-రిక్రూట్‌మెంట్ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. దీని ప్రాధాన్యతను అభ్యర్థులు గుర్తెరగాలని, క్రమం తప్పకుండా తరగతులకు హాజరై, నిరంతర సాధన చేయాలని సీపీ సూచించారు.
రెండు నెలల పాటు వినోదాలు, వేడుకలకు దూరంగా ఉండి, ఏకాగ్రతతో కృషి చేస్తే పోలీస్ శాఖలో చేరాలనే కలను సాకారం చేసుకోగల్గుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రామ్మోహన్ రెడ్డి, భాగ్యకిరణ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ భాగ్య కిరణ్, నిజామాబాద్ ఏసీపి ప్రకాష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

