కలం, నిజామాబాద్ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం అవసరమైనన్ని ఎరువులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్ (Fertilizer App) వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ నిజామాబాద్ (Nizamabad) జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ (Dinesh Patel Kulachari) విమర్శించారు. ఈ మేరకు యాప్‌లో మార్పులు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆన్‌లైన్ ఎరువుల బుకింగ్ యాప్ కారణంగా రైతులు క్షేత్రస్థాయిలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా యూరియాను బుక్ చేసుకునే సమయంలో ‘మండలం’ను ప్రామాణికంగా తీసుకోవడం రైతులకు ఇబ్బందికరంగా మారిందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
మండల కేంద్రాలు లేదా యాప్ సూచించిన పంపిణీ కేంద్రాలు అనేక గ్రామాలకు దూరంగా ఉండటంతో, రైతులు యూరియా బస్తాలను తీసుకురావడానికి అదనపు రవాణా ఖర్చులు భరించాల్సి వస్తోందని తెలిపారు. దీనివల్ల రైతులు వ్యయప్రయాసలకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా, యాప్‌లో ‘మండల యూనిట్’ స్థానంలో రైతులకు దగ్గరగా ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (PACS) లేదా స్థానికంగా గుర్తింపు పొందిన ఎరువుల దుకాణాలను పంపిణీ కేంద్రాలుగా మార్చాలని సూచించారు.
అలాగే ప్రస్తుత వ్యవసాయ సీజన్‌లో రైతులు వరి నాట్లు వేసే పనులలో నిమగ్నమై ఉన్నప్పటికీ, ఒక్క ఎకరానికి ఎన్ని యూరియా బస్తాలు కేటాయిస్తారనే విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడం రైతులలో అయోమయానికి దారితీస్తోందని అన్నారు. ఈ అంశాలను సానుకూలంగా పరిశీలించి, యూరియా బుకింగ్ యాప్‌లో తక్షణమే సాంకేతిక మార్పులు చేసి, ఎకరానికి యూరియా కేటాయింపులపై స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయాలని అధికారులు, ప్రభుత్వాన్ని దినేష్ పటేల్ కోరారు.

