ఢిల్లీలో మరో ఉద్యమం..!

కలం, సెంట్రల్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో మరో భారీ ఉద్యమానికి తెరలేవబోతుందా? ‘సమస్యలపైన నిశ్శబ్దంగా ఉంటే ప్రభుత్వాలు వినవు.. రోడ్డెక్కి గట్టిగా అరిస్తేనే పాలకుల చెవిన పడుతుంది’ అని సామాన్యుడు భావిస్తున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ‘నీట్’ వేడి చల్లారక ముందే ఇప్పుడు సగటు మధ్యతరగతి ఉద్యోగులు, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇథనాల్ బ్లెండెడ్ (E20 Petrol ) కష్టాలపై సరికొత్త ఆందోళన సోషల్ మీడియా ద్వారా ఊపందుకుంటున్నది. ఇప్పటి వరకు ఆన్‌లైన్‌కే పరిమితమైన సామాన్యుడి నిశ్శబ్ద ఆవేదన.. ‘‘సైలెంట్‌గా ఉంటే పని కాదు’’ అన్న రీతిలో ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే ‘ఈ20 జనతా పార్టీ’ సోషల్ మీడియా ఖాతాలకు ఆదరణ పెరుగుతున్నది.

ప్రత్యక్ష నిరసనకు మిలీనియల్స్!

గత కొన్నేళ్ల పరిణామాలను చూస్తే కేంద్ర ప్రభుత్వం బలమైన ప్రజా ఒత్తిడి వచ్చినప్పుడే స్పందిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. షాహీన్ బాగ్ నిరసనల తర్వాత ఎన్ఆర్సీ ప్రతిపాదన ముందుకు సాగకపోవడం, రైతుల ఉద్యమం తర్వాత మూడు వ్యవసాయ చట్టాల రద్దు, తాజాగా విద్యార్థుల ఉద్యమం నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం వంటి పరిణామాలు ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే టాక్సీ డ్రైవర్లతో సాధారణ కార్లు, బైక్లు నడిపే సగటు మిలీనియల్స్ (1981 నుంచి 1996 మధ్య జన్మించిన వ్యక్తులు) కూడా ఇప్పుడు ప్రత్యక్ష నిరసనల వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తున్నది.

హమారీ గాడీ, హమారా అధికార

ఇప్పటికే ‘టీమ్ భారత్’ అనే పౌర వేదిక ఆధ్వర్యంలో ‘హమారీ గాడీ, హమారా అధికార’ అనే నినాదంతో జంతర్ మంతర్ వద్ద సాధారణ వాహనదారులు ఒక విడత నిరసన ప్రదర్శన చేశారు. ఈ20 పెట్రోల్‌తో మైలేజ్ తగ్గడం, ఇంజిన్ సమస్యలు, అధిక ఖర్చులు చూపిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. మరోసారి తెహ్సీన్ పూనావాలా ఆధ్వర్యంలో జులై 31న దేశ రాజధానిలో భారీ ‘గాడీ మార్చ్’ నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు.

అలాగే పాత మోడల్ బైకులు, కార్లు ఉన్న యువత తరఫున ఇండియన్ యూత్ కాంగ్రెస్ కూడా రంగంలోకి దిగి నిరసనలు చేస్తున్నది. ఢిల్లీ ట్యాక్సీ అండ్ టూరిస్ట్ ట్రాన్స్‌పోర్ట‌ర్స్‌ అండ్ టూర్ ఆపరేటర్స్ అసోసియేషన్ కూడా ఆగస్టు 4న పార్లమెంట్ వరకు భారీ పాదయాత్రకు పిలుపునిచ్చింది. ఈ ఆందోళనకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని, వాణిజ్య వాహన యజమానులు ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లడమే తమ ఉద్దేశమని స్పష్టం చేసింది.

ప్రధాన డిమాండ్లు

– వాహన రంగాన్ని, సాధారణ వినియోగదారులను సంప్రదించకుండా ఏకపక్షంగా తీసుకువచ్చిన ఈ20 విధానంపై తక్షణమే సాంకేతిక నిపుణులతో శాస్త్రీయ అధ్యయనం చేయించాలి. వాహన యజమానులు, ఆటోమొబైల్ తయారీ సంస్థలతో కేంద్రం చర్చలు జరపాలి.
– ప్రజలు పూర్తి ధర చెల్లించి పెట్రోల్ కొనుగోలు చేస్తున్నప్పుడు, నాణ్యత తక్కువగా ఉన్న ఇథనాల్ కలిపిన పెట్రోల్ ను అదే ధరకు ఎందుకు విక్రయిస్తున్నారో సమాధానం చెప్పాలి.
– ఈ20 పెట్రోల్ ఇంధనం వల్ల మైలేజీ తగ్గి, ఇంజిన్లు పాడవుతున్నందున ఇంధన ధరలను తగ్గించాలి లేదా నష్టపరిహారం ఇవ్వాలి.
– పెట్రోల్ బంకుల్లో ఇథనాల్ లేని ప్యూర్ పెట్రోల్‌ను ఎంచుకునే ‘రైట్ టు చూజ్’ వినియోగదారులకు ఇవ్వాలి.
– కాలుష్యం పేరుతో పాత వాహనాలను బలవంతంగా రోడ్లపైకి రాకుండా చేస్తున్న ప్రస్తుత స్క్రాపేజ్ విధానాన్ని పునఃసమీక్షించాలి.
– దేశవ్యాప్తంగా భారీగా పెరిగిన టోల్ ప్లాజా చార్జీలను తక్షణమే తగ్గించాలి.

కేంద్రం ఏం చెబుతున్నది..?

– ఇథనాల్ బ్లెండింగ్ ఉద్దేశం ధరలను తగ్గించడం కాదు. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం. మైలేజీ తగ్గడమన్నది చిన్న ఇబ్బంది మాత్రమే. ఈ20 పెట్రోల్‌తో దేశానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
– కేవలం 3-5 శాతం మైలేజీ తగ్గే అవకాశం ఉంది. ఈ పెట్రోల్‌తో మెరుగైన పికప్ లభించడమే కాకుండా, హానికర కార్బన్ ఉద్గారాలు 40 శాతం వరకు తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుంది.
– ఈ20 పెట్రోల్ కారణంగా 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు దేశానికి ఏకంగా రూ.1.90 లక్షల కోట్ల విదేశీ మారకద్రవ్యం ఆదా అయింది.
– విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ముడిచమురుపై ఆధారపడటాన్ని తగ్గించడంలో భాగంగా.. ఇప్పటి వరకు సుమారు 310 లక్షల టన్నుల ముడిచమురు దిగుమతులను ఈ ఇథనాల్ తో విజయవంతంగా భర్తీ చేశాం.
– ఈ స్వదేశీ ఇంధన ఉత్పత్తి ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న చెరకు, అదనపు ధాన్యపు రైతులకు నేరుగా రూ. 1.6 లక్షల కోట్లకు పైగా ఆర్థిక లబ్ధి చేకూరింది.
– అంతర్జాతీయ ఉద్రిక్తతల నుంచి దేశ ఇంధన భద్రతను కాపాడుకోవడానికి ఇథనాల్ పాలసీ అత్యంత కీలకమని సమర్థిస్తున్నది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>