కలం, నిర్మల్: పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి, నాణ్యమైన దర్యాప్తుతో నేరస్తులకు శిక్షలు పడేలా సమన్వయంతో పనిచేయాలని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల (SP Janaki Sharmila) పోలీసు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ జారీ చేసిన ఆదేశాల అమలుపై శనివారం సీడీఓలు, టెక్ టీమ్, సీసీటీఎన్‌ఎస్ రైటర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు.
ప్రతి కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు నుంచి ఛార్జిషీట్ దాఖలు వరకు దర్యాప్తును పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. అవసరమైన సాక్ష్యాధారాలను సేకరించి కోర్టులో సమర్థవంతంగా ప్రవేశపెట్టాలన్నారు. దర్యాప్తులో జాప్యం లేకుండా కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలని, విచారణ ప్రారంభం కాని కేసుల ట్రయల్స్ త్వరగా మొదలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో భైంసా ఏఎస్పీ సాయి కిరణ్, నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌హెచ్‌ఓలు, సీసీటీఎన్‌ఎస్ రైటర్లు, టెక్ టీమ్, సీడీఓలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

