ఇందిరమ్మ బీమాతో పేదలకు భరోసా: పొంగులేటి

​కలం, ఖమ్మం బ్యూరో: నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ‘ఇందిరమ్మ జీవిత బీమా’ పథకాన్ని అమలు చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Minister Ponguleti) అన్నారు. ఖమ్మం కార్పొరేషన్ 60వ డివిజన్ రామన్నపేటలో రూ.90 లక్షల వ్యయంతో చేపట్టనున్న సైడ్ డ్రెయిన్ పనులకు కలెక్టర్ దివాకర టి.ఎస్, కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి మంగళవారం శంకుస్థాపన చేశారు. ​ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 60వ డివిజన్‌లో రూ. 21.70 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్ల కోసం అర్హులైన ప్రతి పేదవాడికి విడతల వారీగా మంజూరు చేస్తామని స్పష్టం చేశారు.

వారందరికీ జీవిత బీమా..

​గతంలో కేవలం భూమి ఉన్న రైతులకు, చేనేత, మేత, గీత కార్మికులకే బీమా సౌకర్యం ఉండేదని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇప్పుడు భూమి లేని నిరుపేదలు, కులవృత్తులు లేని కుటుంబాల పెద్దలకు దురదృష్టవశాత్తు ఏదైనా జరిగితే ఆ కుటుంబం రోడ్డున పడకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రారంభించారని మంత్రి వివరించారు.

నవంబర్ 19న ప్రారంభమైన ఈ పథకం కింద 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న సంపాదించే వ్యక్తికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పిస్తూ, ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. డిసెంబర్ 18 వరకు నమోదు ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ​పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డులు, ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. ఖమ్మం ఆర్డీవో ఎన్.శ్రీనివాస్, హౌజింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>