ప్రజావాణి అంటే లెక్కలేదా? నిర్మల్‌లో రవాణా శాఖ అధికారుల తీరుపై చర్చ

కలం, నిర్మల్: ప్రజల సమస్యలను నేరుగా జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి (Prajavani) కి జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాల్సిందే. ప్రజలు తమ సమస్యలను జిల్లా కలెక్టర్‌‌కు విన్నవించుకుంటే సంబంధిత శాఖ అధికారిని అక్కడికక్కడే ఆదేశించి పరిష్కారానికి చర్యలు తీసుకునేలా ప్రజావాణి వేదికగా మారింది.

అయితే నిర్మల్ (Nirmal) జిల్లా రవాణా శాఖకు మాత్రం ఈ నిబంధనలు వర్తించవ అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. జిల్లా రవాణా అధికారి (డీటీఓ) ప్రజావాణికి హాజరు కాకుండా కిందిస్థాయి జూనియర్ అసిస్టెంట్‌‌ను పంపించి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కలెక్టర్ ఆదేశాలు.. అయినా డుమ్మా..

నిర్మల్ జిల్లా కలెక్టర్‌ గా భవేష్ మిశ్రా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రజావాణికి జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అయితే జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో డీటీఓతో పాటు ఇద్దరు ఎంవీఐలు, నలుగురు ఏఎంవీఐలు ఉన్నారు. ఇంతమంది అధికారులు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రజావాణికి మాత్రం జిల్లా స్థాయి అధికారి హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది.

ప్రజల సమస్యలు వినేందుకు అధికారి రాకపోగా జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగిని పంపించడం ఏ మేరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రతి సోమవారం జరిగే ప్రజావాణికి హాజరయ్యే జిల్లా అధికారుల కోసం ప్రత్యేకంగా హాజరు రిజిస్టర్‌ ను ఏర్పాటు చేశారు. ఇందులో అధికారి పేరు, హోదాతో పాటు సంతకం నమోదు చేస్తారు. దీంతో రవాణా శాఖ జిల్లా అధికారి ఇప్పటివరకు ఎన్నిసార్లు ప్రజావాణికి హాజరయ్యారన్నది ఆ రిజిస్టర్‌ చూస్తే ఇట్టే తేలిపోతుందని ప్రజలు అంటున్నారు.

ప్రజల సమస్యలు పట్టవా..?

రవాణా శాఖకు సంబంధించిన సమస్యలు, ఫిర్యాదులు ప్రజలు జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లడం లేదనే ఉద్దేశంతోనే అధికారులు ప్రజావాణికి దూరంగా ఉంటున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమను అడిగేవారు ఎవరూ లేరన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. కిందిస్థాయి ఉద్యోగిని ప్రజావాణికి పంపించి జిల్లా అధికారి బాధ్యత నుంచి తప్పించుకోవడం సరికాదని, ప్రజల సమస్యలను స్వయంగా వినాల్సిన బాధ్యత సంబంధిత జిల్లా అధికారిపై ఉందని వారు పేర్కొంటున్నారు. జిల్లా కలెక్టర్‌ ప్రత్యేకంగా దృష్టి సారించి రవాణా శాఖ జిల్లా అధికారి ప్రజావాణికి తప్పనిసరిగా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>