కలం, వనపర్తి: వనపర్తి (Wanaparthy) పట్టణం 23వ వార్డులోని సత్యనారాయణరెడ్డి నివాస ప్రాంగణంలో సుమారు 25 సంవత్సరాల క్రితం నందిమల రామస్వామి ఏర్పాటు చేసిన బోర్‌వెల్ (Borewell) ఉంది. గత 18 సంవత్సరాలుగా వినియోగంలో లేకపోవడంతో దాని పరిస్థితిపై స్థానిక కౌన్సిలర్ పలుస శ్రీకర్ గౌడ్ (Palusa Srikar Goud) ప్రత్యేకంగా స్పందించారు.
విషయం తెలుసుకున్న వెంటనే ఆధునిక పరికరాలు, తాజా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి బోర్‌వెల్ లోపలికి ప్రత్యేక సీసీ కెమెరాను పంపించి పరిశీలించారు. బోర్‌లో ప్రస్తుతం ఎంత మేరకు నీటి నిల్వ ఉందనే అంశాన్ని సాంకేతికంగా పరిశీలించిన అనంతరం, అవసరమైన చర్యలు తీసుకుని కొత్త మోటార్లను ఏర్పాటు చేయాలని సంబంధితులకు సూచించారు.
ఈ సందర్భంగా వార్డు ప్రజలు మాట్లాడుతూ.. ఈ ప్రదేశంలో బోర్‌వెల్ ఉన్న విషయం తమకే తెలియదని, కౌన్సిలర్ శ్రీకర్ గౌడ్ చొరవతో పాతబోర్‌ను వాడుకలోకి తేవడం ఆసక్తికరంగా మారిందన్నారు. ఎన్నో సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్న బోర్‌వెల్‌ను గుర్తించి, ఆధునిక సాంకేతికతతో దాని పరిస్థితిని పరిశీలించి ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవడంపై స్థానికులు కౌన్సిలర్‌ను అభినందించారు.

