కలం, సూర్యాపేట: కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల వైఫల్య పాలనపై బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పిలుపుమేరకు ఈ నెల 2వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు సూర్యాపేట శాసనసభ్యులు, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి (Jagadish Reddy) వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
సీఎం రేవంత్ రెడ్డికి ఫ్రస్ట్రేషన్ ఎక్కువై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని జగదీష్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ ప్రస్తావన లేకుండా రేవంత్ రెడ్డి ఒక్క మీటింగ్ కూడా నిర్వహించలేకపోతున్నారని, గుండెల్లో కేసీఆరే నిద్రిస్తున్నట్లు ప్రతి సందర్భంలోనూ ఆయనను కలవరిస్తున్నారని ఎద్దేవా చేశారు. మూసీ బ్రిడ్జ్ ఓపెనింగ్ వంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.
కేసీఆర్ శ్రమించి పనిచేశారు కాబట్టే ప్రజలు, నాయకులు ఆయనను నిరంతరం గుర్తుచేసుకుంటున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ సైన్యాన్ని చూసి కాంగ్రెస్ నాయకులకు భయం పట్టుకుందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పాలమూరు-రంగారెడ్డి సహా ఇతర ప్రాజెక్టుల విషయంలో రేవంత్ రెడ్డి తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని, ఆయనకు రాజకీయ భిక్ష పెట్టిన మహబూబ్నగర్ జిల్లానే ఎండబెడుతున్నారని ఆరోపించారు.
నల్లగొండ జిల్లా ఎండిపోతుంటే ఇక్కడి మంత్రులు నిద్రమత్తులో ఉన్నారని, ఎడమకాల్వకు నీళ్లు విడుదల చేయాలని అడిగే ధైర్యం కూడా స్థానిక ఎమ్మెల్యేలకు లేదని ధ్వజమెత్తారు. నీటి హక్కుల సాధన కోసం కేంద్రానికి ఉత్తరం రాయడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వణుకుతోందని, మన నీళ్లను ఆంధ్ర ప్రాంతానికి తరలిస్తుంటే అడ్డుకోలేని నిస్సహాయ స్థితిలో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఊళ్లలో తాగునీటి ఎద్దడి తలెత్తి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, పాలకులు మాత్రం అవినీతి సొమ్ము లెక్కబెట్టుకోవడంలో బిజీగా ఉన్నారని విమర్శించారు. అడ్డగోలు హామీలిచ్చి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, రైతాంగ సంక్షోభాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని జగదీష్ రెడ్డి (Jagadish Reddy) స్పష్టం చేశారు.
కేటీఆర్ నాయకత్వంలో మిర్యాలగూడలో నిర్వహించ తలపెట్టిన రైతు ధర్నాను ఎన్ని ఆటంకాలు సృష్టించినా జరిపి తీరుతామని, రైతుల సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ బడుగు లింగయ్య యాదవ్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై. వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, మాజీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, కౌన్సిలర్లు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

