కలం, నిర్మల్: స్వాతంత్ర్య దినోత్సవ (Independence Day) వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు పంద్రాగస్టు వేడుకల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ప్రోటోకాల్ ప్రకారం అతిథులను ఆహ్వానించాలన్నారు. దేశభక్తి ఉట్టిపడేలా విద్యార్థులచే సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించాలని అన్నారు. కార్యక్రమం జరుగుతున్నంతసేపు నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలన్నారు. టెంట్, షామియానా, తాగు నీరు ఏర్పాటు చేయాలని చెప్పారు.
తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని వివరించారు. అంబులెన్సు అందుబాటులో ఉంచడంతోపాటు వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని తెలిపారు. పార్కింగ్ ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో ప్రణాళిక ప్రకారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, డిఆర్ఓ రాథోడ్ రమేష్, డిఎస్పీ శ్రీనివాస్, ఆర్డీఓ దేవీదాస్, ఇతర అధికారులు, పాల్గొన్నారు.

