కలం, నిర్మల్ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనాన్ని రూ. 42 వేలకు పెంచాలని, పెన్షన్ను పెంచి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో నిర్వహించనున్న చలో పార్లమెంట్ (Chalo Parliament) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేష్ పిలుపునిచ్చారు. గురువారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో కార్మికులతో కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చిందని, దీనివల్ల కార్మికుల హక్కులు, ఉద్యోగ భద్రతకు ముప్పు ఏర్పడుతుందని విమర్శించారు. కనీస వేతనం రూ. 42 వేలు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేత, రైతులకు మద్దతు ధర, ఉపాధి హామీ పాత చట్టాన్ని కొనసాగించడం వంటి డిమాండ్ల సాధన కోసం కార్మికులు అధిక సంఖ్యలో చలో పార్లమెంట్లో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి దుర్గం నూతన్ కుమార్, గంగారామ్, కేవీపీఎస్ నాయకుడు వెంకటేష్, క్లెమెంట్ వెస్లీ, సాయన్న, లక్ష్మయ్య, లింగన్న, ఎర్రన్న, రాధా, రాజమణి తదితరులు పాల్గొన్నారు.

