కలం, జగిత్యాల : ఈ నెల 30న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా (Shiv Pratap Shukla) జగిత్యాల జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్తో కలిసి కలెక్టర్ కొండగట్టు (Kondagattu), జేఎన్టీయూ పరిసరాల్లో పర్యటించి గవర్నర్ పర్యటన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గవర్నర్ కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్న అనంతరం జేఎన్టీయూలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతి ఏర్పాటును ముందుగానే పూర్తి చేయాలని సూచించారు.
గవర్నర్ చేరుకోనున్న హెలిప్యాడ్ వద్ద బ్యారికేడింగ్, భద్రత, మౌలిక సదుపాయాలను పరిశీలించి, అనుమతి ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతించాలని ఆదేశించారు. అతిథిగృహంలో గౌరవ వందనం, జాతీయ గీతం, రాష్ట్ర గేయం ప్రదర్శనతో పాటు పరిశుభ్రత, విద్యుత్, తాగునీరు, భద్రతా ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. జేఎన్టీయూ అడ్మిన్ బ్లాక్లో సమావేశ వేదిక, సీటింగ్, సౌండ్ సిస్టమ్, విద్యుత్ సరఫరా తదితర ఏర్పాట్లను తనిఖీ చేశారు. వివిధ శాఖల అధికారులు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమగ్ర నివేదికలు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న స్టాళ్లలో వారి ఉత్పత్తులు, జీవనోపాధి కార్యక్రమాలు, విజయాలను ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేయాలని డీఆర్డీఏ అధికారులను ఆదేశించారు.
అనంతరం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి గవర్నర్ స్వాగతం, దర్శనం, అభిషేకం, పూజా కార్యక్రమాల ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ సంప్రదాయాలకు అనుగుణంగా పూర్ణకుంభ స్వాగతం పలకాలని, భక్తులకు ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్యం, తాగునీరు, భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి సారించాలని సూచించారు. గవర్నర్, ఇతర ప్రముఖుల భోజన ఏర్పాట్లలోనూ నాణ్యత, పరిశుభ్రత పాటించాలని తెలిపారు. జేఎన్టీయూ సమీపంలో నిర్వహించనున్న నషా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీ ద్వారా యువతలో మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు.
ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. గవర్నర్ పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్, అతిథిగృహం, ఆలయం, జేఎన్టీయూ పరిసరాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, రూట్ భద్రతకు ముందస్తు ప్రణాళిక రూపొందించాలని సూచించారు. అలాగే గవర్నర్ సమీక్షలో చర్చించనున్న టీబీ ముక్త్ భారత్ అభియాన్, నిక్షయ్ మిత్ర, అనీమియా ముక్త్ భారత్, సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన, తల్లీబిడ్డల ఆరోగ్యం, పోషకాహార కార్యక్రమాలపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నివేదికలు సిద్ధం చేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ పర్యటనలో రెవెన్యూ, పోలీసు, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

