కలం, నిర్మల్ : బ్యాంకింగ్ రంగంలో ఐదు రోజుల పనిదినాల విధానాన్ని అమలు చేయాలని, ప్రభుత్వం ఏకపక్షంగా అమలు చేస్తున్న పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ఆధ్వర్యంలో శుక్రవారం ఒకరోజు సమ్మె (Bank Employees Strike) చేపట్టారు.
ఈ సందర్భంగా యూనియన్ నాయకులు టి. శ్రీనివాస్ (T. Srinivas) మాట్లాడుతూ.. 2024 మార్చి 8వ తేదీన కుదిరిన 12వ బీపీఎస్, 9వ జాయింట్ నోట్ లో ఐదు రోజుల బ్యాంకింగ్ విధానానికి అంగీకారం తెలిపి, ప్రభుత్వానికి సిఫారసు చేసినప్పటికీ ఇప్పటివరకు అమలు కాలేదని అన్నారు.
ఐదు రోజుల పనిదినాలు అమలు చేయాలి
సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజువారీ పని వేళలను 40 నిమిషాలు పెంచి ఐదు రోజుల బ్యాంకింగ్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పీఎల్ఐ విధానంపై యూనియన్లతో ద్వైపాక్షిక చర్చలు జరిపి తగిన సవరణలు చేయాలని కోరారు. డిమాండ్లు పరిష్కారం కాకపోతే సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో మరోసారి సమ్మె చేపడతామని వెల్లడించారు. అంతేకాక సమస్యలు పరిష్కారం కాకపోతే భవిష్యత్‌లో నిరవధిక సమ్మెకు సైతం వెనుకాడబోమని స్పష్టం చేశారు.

