కలం, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం దేశ చరిత్రలోనే గొప్ప కార్యక్రమమని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు. శాసనమండలిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై మాట్లాడిన ఆయన రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు 2 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం జరుగుతుండటం శుభపరిణామమని పేర్కొన్నారు. పేదలకు సొంతింటి కలను నిజం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
పేదల కోసం ఇందిరమ్మ ఇండ్లు
దేశంలో పేదవాడి సొంతింటి కలను సాకారం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో పేదలకు ఇళ్లు నిర్మించడంలో నిర్లక్ష్యం జరిగిందని విమర్శించారు. ఇళ్ల విషయంలో గత ప్రభుత్వం హామీలకే పరిమితమైందని ఆరోపించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పేదల అవసరాలను గుర్తించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తోందన్నారు.
నిజామాబాద్‌లో ఇందిరమ్మ టవర్స్
నిజామాబాద్‌లో పైలట్ ప్రాజెక్టు కింద ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆయన తెలిపారు. పేద కుటుంబాలకు మెరుగైన నివాస వసతులు కల్పించడంతో పాటు, సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ.720 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాల్సిన అవసరం ఉందని మహేష్‌కుమార్ గౌడ్ కోరారు.
బీఆర్‌ఎస్‌పై విమర్శలు
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇళ్ల పేరుతో ప్రజల నుంచి ఓట్లు దండుకుందని మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) విమర్శించారు. పేదల సంక్షేమం విషయంలో ఆ ప్రభుత్వం విఫలమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పేదల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతోందని చెప్పారు. పేదవాడి సొంతింటి కలను పూర్తి స్థాయిలో సాకారం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మాజీ సీఎం కేసీఆర్ పాలనపై కూడా ఆయన విమర్శలు చేస్తూ, ప్రజల తీర్పుతో బీఆర్‌ఎస్ ప్రస్తుత పరిస్థితికి చేరుకుందని వ్యాఖ్యానించారు.

