కలం మెదక్ బ్యూరో : హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లే జాతీయ రహదారి NH 65 పై భారీగా పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు మియాపూర్ (Miyapur) నుంచి సంగారెడ్డి (Sangareddy) వరకు రహదారి విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. నగర విస్తరణతో పాటు వాహనాల రాకపోకలు పెరగడంతో ఈ మార్గం కీలకంగా మారింది. ప్రస్తుతం నాలుగు లేన్లుగా ఉన్న ఈ రహదారిని ఆరు లేన్లుగా విస్తరించే భారీ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది.
సుమారు 31 కిలోమీటర్ల మేర ఈ విస్తరణ పనులకు రూ.1400 కోట్ల వ్యయం అంచనా వేశారు. ఇందులో రోడ్డు నిర్మాణానికి రూ.1000 కోట్లు, భూసేకరణకు రూ.400 కోట్లు కేటాయించారు. మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు రహదారిని 200 అడుగుల వెడల్పుతో అభివృద్ధి చేస్తూ, సర్వీస్ రోడ్లు, ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు ఏర్పాటు చేసి సిగ్నల్-ఫ్రీ ట్రాఫిక్ కోసం ప్రణాళిక రూపొందించారు. బిహెచ్ఈఎల్ సర్కిల్ , పటాన్‌చెరు బస్ స్టాండ్ ఏరియా, ముత్తంగి ఒఆర్ఆర్ దగ్గర, ఇస్నాపూర్ చౌరస్తా , లక్డారం గేటు , రుద్రారం గ్రామం, గణేష్ గడ్డ టెంపుల్, కంది ఐఐటీ వంటి కీలక ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు నిర్మించనున్నారు.
అయితే పనులు ప్రారంభమై రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఆశించిన వేగం కనిపించడంలేదని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో రోడ్డు తవ్వకాలు, నిర్మాణ సామగ్రి కారణంగా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. బిహెచ్ఈఎల్ నుంచి సంగారెడ్డి వరకు అనేక చోట్ల గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలం ముందు వేగంగా పనులు పూర్తి చేయకపోతే మరింత ఆలస్యం తప్పదని వాహనదారులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం సుమారు 30–40 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయని సమాచారం. అధికారులు మాత్రం భూసేకరణ, యుటిలిటీ షిఫ్టింగ్ వంటి కారణాలతో ఆలస్యం జరుగుతోందని, పనులు వేగవంతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు.
Read Also: లీడర్లు వెళ్లినా కేడర్ మనదే: సీఎంకు జగిత్యాల నేతల భరోసా
Follow Us On : WhatsApp

