ఆడ‌పిల్ల పుట్టింద‌ని దారుణం.. రెండో అంత‌స్తు నుంచి…!

క‌లం, వెబ్‌డెస్క్‌: ఉమ్మడి అనంతపురం (Anantapur) జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఆడపిల్ల పుట్టిందని పాప నాయనమ్మ ఏకంగా ఆస్పత్రి భవనం పై నుంచే పసికందును కిందకు విసిరేసింది. అదృష్టవశాత్తు పాప ప్రాణాలతో బయటపడింది. ప్రస్తుతం పాపకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. శ్రీసత్యసాయి జిల్లా లేపాక్షి మండలం మామిడాకులపల్లికి చెందిన అశోక్​కుమార్​, పూజిత కొన్నేళ్లుగా ప్రేమించుకొని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి అశోక్​ తల్లి సత్యమ్మకు ఇష్టం లేదు. దీంతో ఆమె తరచూ పూజితను ద్వేషించేది.

ఈ క్రమంలో ఇటీవల పూజిత ఆడపిల్లకు జన్మనిచ్చింది. అప్పటి వరకు కోడలిని ద్వేషించిన సత్యమ్మ, ఆడపిల్ల పుట్టిందని మనవరాలిని కూడా ద్వేషించడం మొదలుపెట్టింది. తరచూ వీళ్లిద్దరినీ అసహ్యించుకుంటూ సూటిపోటి మాటలతో వేధింపులకు గురిచేసేది. దీనికి తోడు పాపకు ఫిట్స్​​ వస్తుండటంతో వేధింపులు మరింత తీవ్రమయ్యాయి. ఇటీవల పాప అనారోగ్యానికి గురి కావడంతో అనంతపురం జీజీహెచ్​కు తీసుకెళ్లారు. రెండు రోజుల నుంచి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. పాపను ఎలాగైనా వదిలించుకోవాలని భావించిన సత్యమ్మ మంగళవారం అర్ధరాత్రి అందరూ పడుకున్న తర్వాత ఆస్పత్రిలో రెండో అంతస్తు నుంచి పాపను కిందకి విసిరేసింది. మళ్లీ సైలెంట్​గా ఏమీ జరగనట్టు వచ్చి పడుకుంది.

పూజితకు మెలుకువ వచ్చాక పాప లేకపోవడం గమనించి ఆస్పత్రి సిబ్బందిని ప్రశ్నించింది. దీంతో అందరూ పాపను ఎవరో ఎత్తుకుపోయారని భావించారు. కానీ, సీసీ కెమెరాలు పరిశీలించిన తర్వాత అసలు విషయం బయటపడింది. ఆస్పత్రి చుట్టుపక్కల గాలించగా పాప అరుపులు వినిపించాయి. అదృష్టవశాత్తు పాప ఖాళీ వాటర్​ బాటిళ్ల పైన పడటంతో ప్రాణాలతో బయటపడింది. వెంటనే పాపను ఐసీయుకు తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పాప తండ్రితో పాటు నాయనమ్మ పై కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం వారిద్దరినీ విచారిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>