కలం, వరంగల్ బ్యూరో: వివాదాలు, ఆరోపణలకు కేంద్రంగా జనగామ జిల్లా బచ్చన్నపేట పోలీస్ స్టేషన్ (Bachannapet Police Station) మారిందనే చర్చ స్థానికుల్లో విస్తృతంగా జరుగుతోంది. అసలు సమస్య సిబ్బంది పనితీరులో ఉందా? ఉన్నతాధికారుల పర్యవేక్షణలో లోపమా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. వివిధ సమస్యలతో పోలీసులను ఆశ్రయిస్తున్న బాధితుల ఫిర్యాదులపై సకాలంలో స్పందన లభించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా భూ వివాదాల్లో కోర్టు ఆదేశాలున్నా తగిన చర్యలు తీసుకోవడం లేదని కొందరు బాధితులు వాపోతున్నారు.
గతేడాది సెప్టెంబర్ లో పోచన్నపేటలో పింఛన్ దారులకు అందాల్సిన రూ. 5 లక్షలు పోస్ట్ ఆఫీస్ సిబ్బంది మాయం చేశారు. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసి.. ఏడాదైనా కేసులో ఎలాంటి పురోగతి లేదు. ఇటీవల ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటనలు స్థానికంగా చర్చకు దారితీశాయి. ఆయా కేసుల్లో దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? ఏయే చర్యలు తీసుకున్నా రు? అనే అంశాలపైనా ఎలాంటి స్పష్టత లేదు. రాత్రి వేళల్లో ట్రాక్టర్ల ద్వారా పెద్దఎత్తున అక్రమంగా మట్టి తరలిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడంలేదనే విమర్శలు చేస్తున్నారు. మరోవైపు, ముడుపులు అందించిన వారి పనులు వేగంగా పూర్తవుతు న్నాయనే ఆరోపణలు ఉన్నాయి. వీటిపై సమగ్ర విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
గతంలోనూ సస్పెన్షన్లు..
2023 జూన్‌లో నర్మెట సీఐ నాగబాబుతో పాటు బచ్చన్నపేట ఎస్ఐ నవీన్‌కుమార్‌ను అప్పటి వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ సస్పెండ్ చేసిన ఘటనపై విస్తృత చర్చ జరిగింది. పాత కేసుల దర్యాప్తులో నిర్లక్ష్యం, విధుల్లో అలసత్వం వంటి అంశాలు కారణాలుగా పేర్కొన్నారు. గత జూన్ లో విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ సివిల్ తగాదాల్లో జోక్యం చేసుకుంటు న్నారనే ఫిర్యాదులతో విచారణ జరిపి నర్మెట్ట సీఐ అబ్బయ్యతోపాటు బచ్చన్నపేట ఎస్ఐ హమీద్ ను అప్పటి సీపీ సన్ ప్రీత్ సింగ్ సస్పెండ్ చేశారు.
మరోవైపు కొన్నాళ్లుగా జనగామ ఏసీపీ పోస్ట్ ఖాళీగా ఉండగా.. స్టేషన్ ఘన్ పూర్ ఏసీపీ ఇన్ చార్జ్ గా ఉన్నారు. దీంతో రెండు సబ్ డివిజన్లను చూసుకోవడం ఆయనకు భారంగా మారినట్టు తెలుస్తోంది. జనగామ ఏసీపీ పరిధిలోకే బచ్చన్నపేట పోలీస్ స్టేషన్ వస్తుండగా, ఇన్ చార్జ్ ఏసీపీ సరిగా దృష్టిపెట్టకపోవడంతో పోలీస్ స్టేషన్ల అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బచ్చన్నపేట పోలీస్‌స్టేషన్‌పై వస్తున్న ఆరోపణలను ఉన్నతాధికారులు సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వరుస చర్యలతోనైనా మార్పు రాకపోతే, పర్యవేక్షణ లోపాలను గుర్తించి సరిదిద్దాల్సిన బాధ్యత ఉన్నతాధికారులపై ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

