2028 థామస్, ఉబెర్ కప్‌కు ఢిల్లీ ఆతిథ్యం

క‌లం, స్పోర్ట్స్: 2028 థామస్, ఉబెర్ కప్ ఫైనల్స్‌కు (Thomas and Uber Cup) న్యూఢిల్లీ ఆతిథ్యం ఇవ్వనుంది. బ్యాడ్మింటన్ ప్రపంచ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) బుధవారం 2030 వరకు ప్రధాన టోర్నీల వేదికలను ప్రకటించింది. 14 ఏళ్ల తర్వాత ఈ ప్రతిష్టాత్మక టోర్నీ మళ్లీ భారత్‌కు రానుంది. గతంలో 2014లో న్యూఢిల్లీ వేదికగా ఈ పోటీలు జరిగాయి. బీడబ్ల్యూఎఫ్ షెడ్యూల్ ప్రకారం 2027 ప్రపంచ ఛాంపియన్‌షిప్స్ మిస్సిసాగా (కెనడా)లో, సుదీర్మన్ కప్ ఫైనల్స్ బీజింగ్‌లో జరుగుతాయి. 2028 థామస్, ఉబెర్ కప్ న్యూఢిల్లీలో, 2029 సుదీర్మన్ కప్ జియోంజు (దక్షిణ కొరియా)లో నిర్వహిస్తారు.

2030 థామస్, ఉబెర్ కప్ ఫైనల్స్‌కు పారిస్ ఆతిథ్యం ఇవ్వనుంది. 2029, 2030 ప్రపంచ ఛాంపియన్‌షిప్స్ వేదికలను త్వరలో ప్రకటిస్తారు. వేదికలతో పాటు టోర్నీల ఫార్మాట్‌లోనూ బీడబ్ల్యూఎఫ్ మార్పులు చేసింది. 2027 జనవరి 4 నుంచి 3×15 స్కోరింగ్ విధానం అమల్లోకి వస్తుంది. 2027 ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో ఒలింపిక్స్ తరహాలో గ్రూప్ దశ, ఆ తర్వాత నాకౌట్ మ్యాచ్‌లు ఉంటాయి. సింగిల్స్‌లో 48 మంది, డబుల్స్‌లో 32 జంటలు తలపడతాయి. ప్రతి ఆటగాడికి కనీసం రెండు మ్యాచ్‌లు ఆడే అవకాశం లభిస్తుంది. 2028 థామస్, ఉబెర్ కప్‌లో జట్ల సంఖ్యను 16 నుంచి 24కు పెంచారు.

నాలుగు గ్రూపుల్లో ఆరు జట్ల చొప్పున తలపడతాయి. టాప్-12 జట్లు నాకౌట్‌కు చేరుకుంటాయి. ఐదు మ్యాచ్‌ల విధానాన్ని మార్చి, మూడు మ్యాచ్‌ల (బెస్ట్ ఆఫ్ త్రీ) విధానాన్ని తెచ్చారు. సుదీర్మన్ కప్‌లోనూ జట్లను 24కు పెంచినా, పాత ఐదు మ్యాచ్‌ల విధానమే కొనసాగుతుంది. ఎంపిక చేసిన వేదికలు బ్యాడ్మింటన్ అభివృద్ధికి కీలకమని బీడబ్ల్యూఎఫ్ అధ్యక్షురాలు ఖున్యింగ్ పటామా లీస్వాడ్త్రకుల్ పేర్కొన్నారు. ఆవిష్కరణలు, విస్తరణపైనే క్రీడ భవిష్యత్తు ఆధారపడి ఉందని ఆమె తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>