కలం, కరీంనగర్ బ్యూరో: డబ్బు, బంగారంపై దురాశతో 80 ఏళ్ల వృద్ధుడు తన భార్యను హత్య చేసిన దారుణ ఘటన కరీంనగర్ జిల్లా గంగాధర పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగారావుపల్లిలో (Rangaraopalli) వెలుగుచూసింది. మద్యం, సిగరెట్ల ఖర్చుల కోసం డబ్బులు ఇస్తానని ఆశ చూపి మనవడిని హత్యకు సహకరించేలా ప్రేరేపించాడు. ఈ ఘటనలో భర్త దోమకొండ రామయ్య (80), సహకరించిన మైనర్ మనవడిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన చీరను స్వాధీనం చేసుకున్నారు.
ఏం జరిగిందంటే..
రంగారావుపల్లికి చెందిన రామయ్య, భార్య శంకరమ్మ (70) మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు ఉన్నాయి. దీంతో ఒకే ఇంట్లో వేర్వేరు గదుల్లో ఉంటున్నారు. వృద్ధాప్యంలోనూ శంకరమ్మ కూలి పనులు చేస్తూ సంపాదించిన డబ్బులు తనకు ఇవ్వడం లేదని రామయ్య కక్ష పెంచుకున్నాడు. ఆమె వద్ద ఉన్న డబ్బు, బంగారంపై ఆశతో హత్యకు పథకం వేశాడు. ఇందుకోసం మనవడికి మద్యం, సిగరెట్ల ఖర్చులకు డబ్బులు ఇస్తానని ఆశ చూపాడు.
ఈ నెల 8న ఇంట్లో ఎవరూ లేని సమయంలో రామయ్య భార్య శంకరమ్మను వెనుక నుంచి నడుముపై కొట్టి కింద పడేశాడు. మనవడు ఆమె చేతులు, కాళ్లు పట్టుకోగా రామయ్య చీరతో మెడకు బిగించి హత్య చేశాడు. అనంతరం శంకరమ్మ అనారోగ్యంతో రక్తం కక్కి మరణించిందని నమ్మించి మరుసటి రోజు అంత్యక్రియలు నిర్వహించి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు.
పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి నిజాలు
శంకరమ్మ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆమె పెద్ద కుమారుడు అంజయ్య ఇచ్చిన ఫిర్యాదుతో గంగాధర ఎస్ఐ వంశీకృష్ణ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 21న తహసీల్దార్ రజిత, వైద్యాధికారి విజయ్ సమక్షంలో మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. సాంకేతిక ఆధారాలు, విచారణతో హత్య విషయం బయటపడింది. నిందితులు నేరాన్ని అంగీకరించగా, హత్యకు ఉపయోగించిన చీరను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చొప్పదండి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (ఇన్‌చార్జి), కొత్తపల్లి సీఐ కోటేశ్వరరావు పర్యవేక్షణలో ఎస్ఐ వంశీకృష్ణ ఈ కేసును ఛేదించారు. నిందితుడు రామయ్యను న్యాయస్థానంలో, మైనర్ బాలుడిని జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సీఐ తెలిపారు.

