కలం, స్పోర్ట్స్: భారత షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్లో నయనశ్రీ తల్లూరి (Nayana Sri Talluri) మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. డెహ్రాడూన్లో జరిగిన 21వ జాతీయ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ ఛాంపియన్షిప్లో మూడు స్వర్ణ పతకాలు, ఒక కాంస్య పతకం సాధించి వరుసగా ఐదోసారి జాతీయ ఛాంపియన్గా నిలిచింది. నయనశ్రీ 500 మీటర్లు, 1000 మీటర్లు, 1500 మీటర్ల విభాగాల్లో స్వర్ణ పతకాలు గెలుచుకుంది. 3000 మీటర్ల మిక్స్డ్ రిలేలో కాంస్య పతకం దక్కించుకుంది. ఈ ప్రదర్శనతో మరోసారి తన సత్తా చాటింది.
ఈ విజయంతో నయనశ్రీ (Nayana Sri Talluri) వరుసగా ఐదోసారి జాతీయ ఛాంపియన్గా నిలిచి అరుదైన ఘనత సాధించింది. ప్రస్తుతం షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్లో జాతీయ రికార్డు కూడా ఆమె పేరిటే ఉంది. నయనశ్రీ అత్యున్నత స్థాయిలో తన లక్ష్యాలను చేరుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం, కార్పొరేట్ సంస్థలు అండగా నిలవాలని ఆమె కుటుంబ సభ్యులు కోరారు. సరైన సహకారం లభిస్తే అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆమె మరిన్ని విజయాలు సాధించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.

