కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సెప్టెంబర్ నెలకు సంబంధించిన నేర సమీక్షా సమావేశాన్ని సోమవారం పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం (CP Gaush Alam) అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ, పెండింగ్ కేసుల పురోగతి, రాబోయే దసరా, దుర్గామాత నిమజ్జన బందోబస్తు ఏర్పాట్లపై అధికారులతో సీపీ సమగ్ర సమీక్ష చేపట్టారు. సమావేశంలో సీపీ గౌష్ ఆలం మాట్లాడుతూ… రాబోయే పండుగల వేళ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు.
మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలు, పోక్సో, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం అందించాలని సీపీ సూచించారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని స్పష్టం చేశారు. నూతన నేర న్యాయ చట్టాల అమలుతో పాటు ఈ-సమ్మన్స్, ఈ-సాక్ష్య, సీసీటీఎన్‌ఎస్, CEIR పోర్టల్ ద్వారా పోయిన మొబైల్ ఫోన్లను రికవరీ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. అలాగే గంజాయి, డ్రగ్స్, పీడీఎస్ బియ్యం, ఇసుక అక్రమ రవాణా, జూదం లాంటి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని హెచ్చరించారు.
ప్రజావాణి, డయల్ 100/112 ద్వారా వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి పారదర్శకమైన సేవలు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా కేసుల ఛేదనలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులకు, సిబ్బందికి సీపీ ప్రశంసా పత్రాలు, రివార్డులను అందజేసి అభినందించారు. ఈ సమావేశంలో ఏసీపీలు శ్రీనివాస్ జి, వెంకటస్వామి, విజయకుమార్, యాదగిరిస్వామి, స్వామి, శ్రీనివాస్, మాధవి, వాసాల సతీష్‌లతో పాటు కమిషనరేట్ పరిధిలోని సీఐలు, ఎస్సైలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

