కలం, జోగులాంబ గద్వాల: కక్షిదారుల వివాదాలకు లోక్ అదాలత్‌లో శాశ్వత పరిష్కారం లభిస్తుందని, వారికి సమయం, డబ్బు ఆదా అవుతుందని గద్వాల కోర్టు జిల్లా న్యాయమూర్తి కల్యాణ్ చక్రవర్తి అన్నారు. గద్వాల జిల్లా కోర్టు ఆవరణలో శనివారం జాతీయ లోక్ అదాలత్ (Gadwal Lok Adalat) కార్యక్రమాలను నిర్వహించి కక్షిదారులు పరస్పర సమ్మతితో దావాలను న్యాయమూర్తులు పరిష్కరించారు.
ఈ నేపథ్యంలో గద్వాల కోర్టు ఆవరణలోని న్యాయసేవా సదన్ భవన్లో జిల్లా న్యాయమూర్తి కల్యాణ్ చక్రవర్తి లాంఛనంగా లోక్ అదాలత్‌ను ప్రారంభించారు. లోక్ అదాలత్ ద్వారా 8,486 కేసులను పరిష్కరించినట్లు.. ప్రజలకు సత్వర న్యాయం అందించడంతో పాటు, పెండింగ్‌లో ఉన్న కేసులను రాజీ మార్గంలో పరిష్కరించేందుకు లోక్ అదాలత్ నిర్వహించినట్లు కల్యాణ్ చక్రవర్తి పేర్కొన్నారు.
క్రిమినల్ కేసులు 8,459, సివిల్ కేసులు 27, సైబర్ క్రైమ్ కేసులు 09, బ్యాంకు లిటిగేషన్ కేసులు 10, మోటారు వాహన ప్రమాద కేసులు 02 తదితర పెండింగ్ కేసుల్లో ఇరుపక్షాల (కక్షిదారుల) సమ్మతితో రాజీ కుదిర్చి పరిష్కరించినట్లు, దీని ద్వారా మొత్తం రూ. 1,43,60,970 పరిష్కరించబడిందని న్యాయమూర్తి కల్యాణ్ చక్రవర్తి అన్నారు. ప్రజలు లోక్ అదాలత్‌లను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పోక్సో న్యాయమూర్తి వి. శ్రీనివాస్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎ. నాగరాజు, కార్యదర్శి జి. నిష్పా పాత్రుడు, ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి వెంకటేష్ దుర్వా, గద్వాల డీఎస్పీ మొగులయ్య, న్యాయవాదులు, కక్షిదారులు, న్యాయశాఖ సిబ్బంది, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

