నర్సింగపల్లిలో పుష్కర వైభవం.. బ్రహ్మోత్సవాలు ప్రారంభం

కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం నర్సింగపల్లి (Narsingapalli) ఇందూరు తిరుమల ఆలయంలో 12వ పుష్కర బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. యజ్ఞాచార్యులు శ్రీ సముద్రాల శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం నుంచి 16వ తేదీ వరకు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. ఈ ఉత్సవాల్లో త్రిదండి చిన్న జీయర్ స్వామి, దేవనాథ రామానుజ జీయర్ స్వామి పాల్గొననున్నారు. ఇప్పటికే దేవనాథ జీయర్ స్వామి ఆలయానికి చేరుకోగా, చిన్న జీయర్ స్వామి 10వ తేదీన విచ్చేస్తారు.

ఈరోజు ధ్వజారోహణం, అగ్ని ప్రతిష్ఠ, సంతానం లేని వారికి గరుడ ప్రసాద వితరణ, స్వామివారి శేష వాహన సేవ కార్యక్రమాలు జరుగుతాయి. 10న సూర్యప్రభ, చంద్రప్రభ వాహన సేవలు నిర్వహిస్తారు. 11న సుదర్శన నరసింహ హవనం, హంస వాహన సేవ ఉంటాయి. 12న లక్ష్మీ హయగ్రీవ హవనం, గజ వాహన సేవ, ఎదుర్కోలు ఉత్సవాలు చేపడతారు. 13న శ్రీ భూ సమేత శ్రీనివాస కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. 14న శ్రీమద్భగవద్గీత పారాయణం, అశ్వ వాహన సేవ, దీపోత్సవం నిర్వహిస్తారు. 15న మాడవీధుల్లో స్వామివారి రథోత్సవం, శ్రీ చక్రస్నానం, పుష్పయాగం, పూర్ణాహుతి, కుంభ ప్రోక్షణ కార్యక్రమాలు జరగనున్నాయి. 16న మూల విరాట్టుకు ఉత్సవానంతర స్నపనంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

నర్సింగపల్లి గ్రామస్తుల శ్రమదానం, సినీ నిర్మాత దిల్ రాజు కుటుంబ సభ్యుల సహకారంతో ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రం నిర్మించి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ పుష్కర బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. అర్చకులు రోహిత్ కుమారాచార్య మాట్లాడుతూ, స్వామివారి ప్రాభవం రెట్టింపు అయిందని, ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటే భక్తులకు సకల శుభాలు కలుగుతాయని తెలిపారు. లోక కల్యాణార్థం చేసే ఈ ఉత్సవాలు వేంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమని వివరించారు. ఈ కార్యక్రమంలో యజ్ఞాచార్యులు సముద్రాల శ్రీనివాసాచార్యులు, ఆలయ ధర్మకర్తలు నర్సింహ్మ రెడ్డి, విజయసింహారెడ్డి, సంపత్ కుమారాచార్య, రోహిత్ కుమారాచార్య, నరాల సుధాకర్, నర్సారెడ్డి, రమేష్, మురళి, భాస్కర్, సురేష్, గంగారెడ్డి, సాయిలు, సాయి పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>