కలం, మహబూబ్నగర్ బ్యూరో : ప్రభుత్వ ఆసుపత్రులలోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువస్తున్నామని ప్రభుత్వ విప్, మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (MLA Yennam) తెలిపారు. మహబూబ్నగర్ నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో (Mahabubnagar GGH) ముడా నిధుల ద్వారా రూ.15 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన అధునాతన శస్త్ర చికిత్స పరికరాలను ఎమ్మెల్యే ఆసుపత్రి అధికారులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.
త్వరలోనే మహబూబ్నగర్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభానికి చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, తల్లులు, శిశువులకు అవసరమైన వైద్య సదుపాయాలు సమయానికి అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రసవాల కోసం వచ్చే మహిళలకు అవసరమైన పరికరాలు, మందులు, వైద్య సేవలు అందుబాటులో ఉంచుతున్నామని వెల్లడించారు. డాక్టర్లు , నర్సులు, ఆశా వర్కర్లకు విశ్రాంతి సదుపాయాలు కల్పిస్తున్నామని, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు కూడా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.
ఆసుపత్రిలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. రోగులతో పాటు వచ్చే అటెండెంట్లు కూడా పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఆసుపత్రి పరిసరాలలో చెత్త వేయడం, పాన్ వినియోగం వంటి చర్యలను నివారించాలని హెచ్చరించారు. డెలివరీ వార్డులో అనవసర రద్దీ లేకుండా నియంత్రణ చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి వారం శుభ్రత, మరమ్మతు పనులు చేపడుతూ రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
శిశువుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఆసుపత్రి నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు ఎమ్మెల్యే గర్భిణీ స్త్రీల ఓపీ విభాగాన్ని పరిశీలించి, రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రంగ అజ్మీర, కార్పొరేటర్లు సల్మాన్, షబ్బీర్ అహ్మద్, రమేష్ రెడ్డి, ఫకృ, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు బెజ్జుగం రాఘవేందర్, సాదుల్లా తదితరులు పాల్గొన్నారు.

