కలం, నర్సంపేట : నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పై నిందలు వేస్తూ, అసత్య ఆరోపణలు చేస్తే ఆ నాలుకలను కత్తిరిస్తామని టీపీసీసీ సభ్యుడు (TPCC Leader) పెండెం రామానంద్ (Pendem Ramanand) హెచ్చరించారు. టీఆర్ఎస్ నాయకుల చిట్టా మా చేతిలో ఉందని ఒక్కొక్కరి చిట్టా విప్పితే వారి బాగోతం బట్టబయలు అవుతుందని, వారిని ప్రజలే ఉరికించి కొడతారని విమర్శించారు. నర్సంపేట (Narsampet) లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెండెం రామానంద్ మాట్లాడారు.
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అనారోగ్యంతో ఉంటే వారికి మెరుగైన చికిత్స కోసం కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి హైదరాబాదుకు తరలించిన విషయం బీఆర్ఎస్ నాయకులు విషయం మరవద్దన్నారు. పెద్ది మరణాన్ని పార్టీలకు అతీతంగా ప్రజలందరూ సంతాపం వ్యక్తం చేశారన్నారు.
ఉద్యమకారుడి విగ్రహాన్ని కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం ఎలాంటి అనుమతులు లేకుండా అసైన్డ్ భూముల్లో ఏర్పాటు చేశారని, అందుకే అధికారులు తమ పని తాము చేశారని స్పష్టం చేశారు. దీనికి ఎమ్మెల్యేను, కాంగ్రెస్ నాయకులను బద్నాం చేయడం, దిష్టిబొమ్మలను దగ్ధం చేయడం, శవ రాజకీయాలకు పాల్పడడం బిఆర్ఎస్ నాయకులకు సరికాదని హితవు పలికారు.
అన్ని అనుమతులతో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే తాము స్వాగతిస్తామని, ఒకవేళ మీకు చేతకాకపోతే కాంగ్రెస్ నాయకులే విరాళాలు వేసుకొని అన్ని అనుమతులతో ఏర్పాటు చేస్తామన్నారు. అంతేకానీ శవ రాజకీయాలకు పాల్పడడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు.
ప్రజలు, ఉద్యమకారులే టీఆర్ఎస్ నాయకుల భరతం పడతారని అన్నారు. రియల్ ఎస్టేట్ పేరుతో అక్రమ వెంచర్లు చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన బీఆర్ఎస్ నాయకులు తమ పద్ధతులు మానుకోవాలని లేదంటే వారి భరతం పట్టడం ఖాయమని భగ్గుమన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు చింతల సాంబ రెడ్డి, పంబి వంశీ, సందీప్, మురళి తదితరులు పాల్గొన్నారు.

