కలం, నల్లగొండ : ఆర్టీసీ గుర్తింపు సంఘ ఎన్నికల్లో కార్మికులు తమ హక్కులు, ఉద్యోగ భద్రతను దృష్టిలో పెట్టుకుని, నిరంతరం ప్రశ్నించి పోరాడే జేఏసీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం (Nellikanti Satyam) పిలుపునిచ్చారు. నల్లగొండ ఆర్టీసీ డిపోలో ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.బాబు, టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డిలతో కలిసి ఆదివారం ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘బస్సు’, ‘నిచ్చెన’ గుర్తులకు ఓటు వేసి జేఏసీ కూటమిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
అనంతరం జరిగిన సమావేశంలో సత్యం మాట్లాడుతూ.. 2016 తర్వాత దాదాపు దశాబ్దం కాలం ముగిశాక జరుగుతున్న ఈ గుర్తింపు సంఘ ఎన్నికలు ఆర్టీసీ కార్మికులకు అత్యంత కీలకమైనవని పేర్కొన్నారు. కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో, సర్వీస్ రూల్స్, నిబంధనలను సమగ్రంగా పరిశీలించి కార్మికులకు ఎలాంటి నష్టం జరగకుండా కాపాడే బాధ్యత గుర్తింపు పొందే యూనియన్పైనే ఉంటుందన్నారు. విలీనం అంశంపై కొందరు తామే బ్రాండ్ అంబాసిడర్లమని ప్రచారం చేసుకుంటున్నారని, అద్దె యూనియన్ల మాయమాటలకు లొంగకుండా ఎవరు నిజంగా పోరాడారో చరిత్ర చూసి నిర్ణయించుకోవాలని సూచించారు.
చట్టసభల్లోనూ కార్మికుల సమస్యలపై బలంగా గళం విప్పుతానని ఆయన (Nellikanti Satyam) హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఈయూ, టీఎంయూ నాయకులు మాట్లాడుతూ.. యూనియన్లు లేని సమయంలోనూ గేట్ మీటింగ్లు, ధర్నాలు, ఛలో బస్ భవన్, అసెంబ్లీ ముట్టడి వంటి పోరాటాలు చేసి కార్మికుల పక్షాన నిలిచామని గుర్తుచేశారు. కార్మికుల ప్రయోజనాల కోసం జేఏసీ కూటమిని గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ పల్లా దేవేందర్ రెడ్డి, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి లోడే శ్రవణ్ కుమార్, పబ్బు వీరస్వామి, కేఎస్ రెడ్డి, బోనగిరి నరేందర్, జమాల్ గౌడ్, డీజే రావు, బాసాని వెంకటయ్య, కే దయాకర్, ఎస్.కే గులాం రసూల్, ఎల్ స్వామి, ఎన్ఆర్సీ రాజు, లూర్దమ్మ, బి.శంకరమ్మ, ఎండి జానీ, తదితరులు పాల్గొన్నారు.

