నార్కట్‌పల్లి పీఎస్ రికవరీ కేసులో ఐజీ ఆకస్మిక తనిఖీలు

కలం, నిఘా విభాగం: నార్కట్‌పల్లి (Narketpally) పీఎస్ పరిధిలో రికవరీ బంగారం మాయం కేసు(Gold Recovery Case).. ఉమ్మడి నల్లగొండ జిల్లా పోలీసులను కలవరం పెట్టిస్తోంది. ఎస్ఐ విష్ణుమూర్తి చేతివాటం నుంచి కేసు ఉన్నతాధికారులు, సిబ్బంది ప్రమేయం వైపు మళ్లుతోంది. ఇలాంటి పరిణామాలతో యాదాద్రి మల్టీజోన్ ఐజీ షాహనవాజ్ ఖాసిం సోమవారం చిట్యాల సీఐ ఆఫీస్, పోలీస్ స్టేషన్లలో ఆకస్మికంగా తనిఖీలు చేయడం చర్చనీయాంశమైంది.
రోడ్డు ప్రమాదాల నివారణ, మహిళలు, బాలల భద్రతపై సమీక్ష అని చెప్పినా.. అసలు కథ నార్కట్‌పల్లి బంగారం రికవరీ కేసు, జిల్లాలోని పోలీసుల అవినీతి నెట్‌వర్క్‌ను బయటకు లాగేందుకేననే ప్రచారం పోలీసుల్లో గుబులు రేపుతోంది. నార్కట్‌పల్లి పీఎస్ కు కేవలం 6 కిలోమీటర్ల దూరంలోని చిట్యాల సీఐ ఆఫీసులో ఐజీ సుదీర్ఘంగా విచారణ చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది.
రికవరీ బంగారం మాయం చేయడంలో నార్కట్‌పల్లి ఎస్ఐ విష్ణుమూర్తితో పాటు డివిజన్, సర్కిల్ స్థాయి అధికారుల ప్రమేయం ఏ మేరకు ఉందనే దానిపైనే ఐజీ లోతుగా ఆరా తీసినట్లు సమాచారం. నల్లగొండ టౌన్‌లో గతంలో జరిగిన ఓ హత్య కేసు విచారణ సమయంలోనూ ఘటనా స్థలంలో లభించిన రెండు తులాల బంగారు బిస్కెట్లను ఓ పోలీస్ ఉన్నతాధికారి నొక్కేసి మాయం చేశారనే ఆరోపణలు ఇప్పుడు ఐజీ దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో జిల్లాలోని రికవరీ కేసుల పాత రికార్డులను కూడా ఉన్నతాధికారులు తిరగేస్తుండడంతో పలువురు అధికారుల్లో టెన్షన్ పట్టుకుంది.

ఏళ్లుగా తిష్ట.. భద్రత డొల్ల

ఏళ్లుగా జిల్లా కేంద్రం, చుట్టుపక్కల ప్రాంతాల్లో కొందరు అధికారులు, సిబ్బంది విధుల్లో ఉంటూ దందాలు, వ్యాపారాల మోజులో పడ్డారనే విమర్శలు ఉన్నాయి. తెలంగాణ కాలనీలో ముందస్తు చోరీ ఫిర్యాదులను పోలీసులు తేలికగా తీసిపారేయడంతో ఒకే కుటుంబానికి దంపతులు సహ ఇద్దరు పిల్లలు దారుణ హత్యకు గురయ్యారు. కలెక్టరేట్ సమీపంలో యువకుడి హత్య, శ్రీకాకుళం కూలీల ఘర్షణలో రాళ్లతో కొట్టి చంపడం.. బీటీఎస్ ఏరియాలో బాలిక అనుమానాస్పద మృతి, దేవరకొండ రోడ్డులో హత్య, బస్టాండ్ సమీపంలో యువతి ఆత్మహత్య, ముషంపల్లి రోడ్డులో గొలుసు చోరీ, మీర్‌బాగ్ కాలనీలో తమిళనాడు కూలీ హత్య.. ఇలా వరుస ఘటనలపై పోలీసులు నిర్లక్ష్యంగా ఉన్నారనే విమర్శలు వెల్లువెత్తాయి.
ఇటీవల మిర్యాలగూడలో బంగారం కొనుగోళ్లకు సంబంధించి జీఎస్టీ లేదు.. నకిలీ బంగారం.. అనుమతుల్లేవంటూ.. కొంతమంది అధికారులు సదరు వ్యాపారుల నుంచి భారీగానే నొక్కిసినట్టు తెలిసింది. అంతకుముందు సాగర్ కు చెందిన ఓ వ్యక్తి అధిక వడ్డీ పేరుతో భారీ మోసానికి తెర లేపారు. ఆయా కేసుల్లోనూ పెద్దఎత్తున గోల్‌మాల్ జరిగిందనేది ప్రచారంలో ఉంది.

ఫిర్యాదులపై నిర్లక్ష్యం.. బాధితులపైనే దౌర్జన్యం

ఓ కేసులో చోరీ జరిగితే సంబంధం లేని వ్యక్తిని స్టేషన్‌కు తీసుకెళ్లి, చిత్రహింసలకు గురిచేసి ఆ తర్వాత తప్పు తెలుసుకొని క్షమాపణలు చెప్పడం పోలీసుల పనితీరుకు నిదర్శనం. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో ఓ వ్యక్తి బైక్ కీ లాక్కొని అవమానించడంతో అతడు ఆవేదన చెంది స్టేషన్‌లోనే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడిన కేసులో రాజకీయ ఒత్తిళ్లతో తొక్కిపెట్టారనే ఆరోపణ ఉంది.
ఓ మిస్సింగ్ కేసుపై బాధితుల ఫిర్యాదును పట్టించుకోకపోవడంతో మాడుగులపల్లి స్మశానవాటికలో డెడ్ బాడీ లభించాకే పోలీసుల్లో కదలిక వచ్చింది. ఇటీవల నల్లగొండ టౌన్ కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కేసుల్లోనూ పోలీసులపై ఆరోపణలు వినిపించాయి. మరోవైపు పోలీసుల నిర్లక్ష్యం క కారణంగా ప్రజల ప్రాణాలు, ఆస్తులకు భద్రత లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి ఆయా కేసుల్లో నిజానిజాలు తేల్చాల్సిన అవసరం ఉంది.
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>