కలం, నేషనల్ డెస్క్ : సంపన్న దేశాల్లోని అత్యంత పేద ప్రజల రోజువారీ ఆదాయం, వినియోగ వ్యయం.. మన దేశంలోని అత్యంత ధనికుల రోజువారీ ఆదాయం కంటే ఎక్కువగా ఉందని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది (World Bank Report). ఈ లెక్కలకు సంబంధించి తాజాగా 2026 పావర్టీ అండ్ ఇనీక్వాలిటీ ప్లాట్ఫామ్ నివేదికను విడుదల చేసింది. ప్రపంచ దేశాల మధ్య ఉన్న జీవన ప్రమాణాలు, ఆదాయాల అంతరాలను ఈ గణాంకాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి.
మన దేశంలో అత్యంత పేదల (దిగువన ఉన్న 10 శాతం) రోజువారీ ఆదాయం, వినియోగ వ్యయం సగటున 3 అమెరికన్ (సుమారు రూ. 286) మాత్రమే ఉంది. మరోవైపు, దేశంలో అత్యంత ధనికుల (సంపన్నుల జాబితాలో టాప్లో ఉన్న 10 శాతం) రోజువారీ ఆదాయ పరిమితి సగటున 10 డాలర్లు (సుమారు రూ. 955) గా నమోదైంది. అమెరికా వంటి దేశాల్లో అత్యంత పేదల (జాబితాలో దిగువన ఉన్న 10 శాతం) రోజువారీ ఆదాయం సగటున 25 డాలర్లుగా ఉంది. ఇక కెనడాలో ఇది 31డాలర్లు, జర్మనీ, ఆస్ట్రేలియాల్లో 28 డాలర్ల చొప్పున ఉంది. అంటే భారత్లోని టాప్ 10 శాతం సంపన్నుల కంటే అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ వంటి దేశాల్లోని అంత్యంత పేదలే రోజువారీగా ఎక్కువ ఆదాయాన్ని/వినియోగ సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు.
సంపన్న దేశాల ధనికుల ఆదాయం..
సంపన్న దేశాల్లోని ఎగువ 10 శాతం ధనికుల రోజువారీ ఆదాయంతో పోల్చితే అంతరం మరీ తీవ్రంగా ఉంది. అమెరికాలో సంపన్నుల రోజువారీ ఆదాయం 173 డాలర్లు కాగా, కెనడా, ఆస్ట్రేలియాల్లో 129 డాలర్లు, జర్మనీలో 128డాలర్లుగా ఉంది. భారత ఆర్థిక వ్యవస్థ గణనీయమైన ప్రగతిని సాధిస్తున్నప్పటికీ, ప్రజల సగటు ఆదాయ స్థాయిలు తక్కువగా ఉండటమే ఈ పరిస్థితికి కారణమని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. మన దేశంలో కేవలం పేదరికం తగ్గించడమే కాకుండా, పరిశ్రమలు, వ్యాపారాల్లో ఉత్పాదకత పెరిగినప్పుడే ఉద్యోగుల వేతనాలు, సగటు ఆదాయాలు పెరుగుతాయని చెప్తున్నారు.

