కలం, జోగులాంబ గద్వాల: జిల్లా రవాణా శాఖ అధికారుల తీరుపై లారీ యజమానులు, డ్రైవర్లు తిరగబడ్డారు. స్టిక్కర్ల పేరుతో అధిక వసూళ్లు, ట్యాక్స్ గడువు ముగిసిందంటూ భారీ జరిమానాల విధింపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ శుక్రవారం గద్వాల(Gadwal) డీటీఓ కార్యాలయం ఎదుట లారీలను అడ్డుపెట్టి నిరసనకు దిగారు. అక్రమ వసూళ్ల ఆరోపణలపై అధికారులు సమాధానం చెప్పాలని లారీ యజమానులు డిమాండ్ చేశారు. నిబంధనల పేరుతో తమను ఆర్థికంగా వేధిస్తున్నారని, రోడ్లపై ఎక్కడపడితే అక్కడ వాహనాలను ఆపి ఇష్టారాజ్యంగా చలాన్లు వేస్తున్నారని మండిపడ్డారు.
లారీలతో కార్యాలయం ఎదుట నిరసన చేపట్టడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కార్యాలయానికి చేరుకుని అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాహనదారుల ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని వ్యవహరించాలని ఇన్‌చార్జి డీటీఓకు సూచించారు. ఉమ్మడి జిల్లాలో ఒకే నిబంధనలు అమలవుతుంటే గద్వాలలోనే భిన్నంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు.

