రైస్ మిల్లుల్లో అధికారుల త‌నిఖీలు

కలం, నారాయణపేట: నారాయణపేట (Narayanpet) జిల్లాలోని రైస్ మిల్లులు, హోల్‌సేల్, రిటైల్ బియ్యం వ్యాపారులు ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారమే బియ్యాన్ని విక్రయించాలని నారాయణపేట జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం BPT, KNM రకం బియ్యం కిలో రూ.66, RNR మరియు తెలంగాణ సోనా రకం బియ్యం కిలో రూ.74, HMT, JSR రకం బియ్యం కిలో రూ.79గా నిర్దేశించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం జిల్లా పౌరసరఫరాల అధికారి బాలరాజు, జిల్లా మేనేజర్ సైదులు, తహసీల్దార్లు, కొలతల శాఖ అధికారులు, పౌరసరఫరాల ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు జిల్లాలోని పలు రైస్ మిల్లులు, హోల్‌సేల్, రిటైల్ బియ్యం వ్యాపార దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. బియ్యం విక్రయ ధరలను, తూకం మరియు కొలతలను పరిశీలించారు. జిల్లాలో సరిపడా బియ్యం నిల్వలు ఉన్నాయని, బియ్యం కొరత లేదని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు.

ప్రభుత్వం నిర్దేశించిన ధరల ప్రకారమే బియ్యాన్ని విక్రయించాలని, నిర్ణీత ధరలకు మించి విక్రయించకుండా సంబంధిత వ్యాపారులకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ప్రభుత్వం నిర్ణయించిన ధరల పట్టిక (Rate List) బోర్డులను ప్రతి రైస్ మిల్లు, హోల్‌సేల్, రిటైల్ బియ్యం వ్యాపార దుకాణాల్లో వినియోగదారులకు స్పష్టంగా కనిపించే విధంగా ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు విరుద్ధంగా అధిక ధరలకు బియ్యం విక్రయించడం, తూకం మరియు కొలతల్లో అక్రమాలకు పాల్పడటం వంటి ఉల్లంఘనలకు పాల్పడినట్లు గుర్తిస్తే సంబంధిత వ్యాపారులపై నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేయడంతో పాటు తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినియోగదారులు కూడా బియ్యం కొనుగోలు సమయంలో నిర్దేశిత ధరలను తెలుసుకొని, అధిక ధరలు వసూలు చేసినా లేదా తూకంలో మోసాలకు పాల్పడినా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>