కలం, మిర్యాలగూడ: అకాల వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (Bathula Laxma Reddy) భరోసా ఇచ్చారు. దామరచర్ల మండలం బెట్టే తండా, రాళ్లవాగు తండా గ్రామాల్లో అకాల గాలివానలకు నేలకొరిగిన వరి పంటలను సోమవారం పరిశీలించారు. పొలాల్లోకి దిగి దెబ్బతిన్న వరి పైరును పరిశీలించి.. రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కష్టపడి పండించిన పంట చేతికందే సమయంలో ఇలాంటి విపత్తు రావడం విచారకరమన్నారు. వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులతో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఫోన్‌లో మాట్లాడారు. మండలంలో దెబ్బతిన్న పంటల వివరాలను వెంటనే సర్వే చేసి అంచనా వేయాలని, నష్ట నివేదికలను సిద్ధం చేయాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నష్టపోయిన ప్రతి రైతుకూ న్యాయం జరిగేలా, నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

