బీసీల రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం: బీసీ రమణ

కలం, జగిత్యాల: జాతీయ బీసీ చైతన్య సమితి (BC Chaitanya Samithi) జగిత్యాల జిల్లా కార్యవర్గ సమావేశం సోమవారం మార్కండేయ దేవాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు బీసీ రమణ ముఖ్య అతిథిగా హాజరై బీసీల హక్కులు, రిజర్వేషన్లు, రాజకీయ ప్రాతినిధ్యం, రాజ్యాధికార సాధనపై ప్రసంగించారు. దేశంలో బీసీలకు జనాభా ప్రాతిపదికన న్యాయమైన వాటా కల్పించడంతో పాటు, రిజర్వేషన్లకు చట్టబద్ధమైన, రాజ్యాంగపరమైన రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం అవసరమైన చట్ట సవరణలు చేపట్టాలని అన్నారు. రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు విధించిన పరిమితులు, న్యాయపరమైన అడ్డంకులను అధిగమించేలా రాజ్యాంగపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

తమిళనాడు రాష్ట్రంలో 69 శాతం రిజర్వేషన్లు అమలులో ఉన్నాయని, 1994లో ఆ రాష్ట్ర రిజర్వేషన్ల చట్టాన్ని 76వ రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్‌లో చేర్చారని గుర్తుచేశారు. ఇదే తరహాలో బీసీలకు న్యాయం జరిగేలా తెలుగు రాష్ట్రాల్లో కూడా బలమైన చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరారు. బీసీలకు ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడమే కాకుండా, వాటిని ఆచరణలో అమలు చేయాలని స్పష్టం చేశారు. బీసీలు కేవలం ఓటు బ్యాంకుగా మిగిలిపోకుండా రాజకీయ అధికారాన్ని సాధించే దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుంచి పార్లమెంట్ వరకు బీసీల ప్రాతినిధ్యం పెరగాలని, యువత రాజకీయాల్లోకి వచ్చి నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని సూచించారు.

రాజ్యాధికారం సాధించినప్పుడే బీసీలకు నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. విద్య, ఉద్యోగాలు, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో బీసీలు అభివృద్ధి చెందాలంటే అధికారంలో భాగస్వామ్యం కావాలని అన్నారు. బీసీల ఐక్యత, చైతన్యం, సంఘటిత పోరాటంతోనే హక్కులను సాధించుకోవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో జాతీయ బీసీ చైతన్య సమితి నాయకులు, జగిత్యాల జిల్లా కార్యవర్గ సభ్యులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>