పేదల గుడిసెలు కూల్చొద్దు: వినోద్ కుమార్

కలం, హనుమకొండ: కాజీపేటలోని వైఎస్సార్‌ నగర్‌ గుడిసెవాసులకు ఇంటి పట్టాలు ఇచ్చి, పక్కా ఇళ్లు నిర్మించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌ కుమార్‌ (Boinapally Vinod Kumar) డిమాండ్‌ చేశారు. 30 ఏళ్లుగా నివసిస్తున్న పేదల గుడిసెలను కూల్చే ప్రయత్నాలను ఆపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. సోమవారం బీఆర్ఎస్‌, సీపీఎం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కాజీపేట చౌరస్తా నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ.. వైఎస్సార్‌ నగర్‌లోని సర్వే నంబర్లు 70, 71, 720 భూముల రికార్డులపై అనుమానాలున్నాయని, వాస్తవానికి అవి సీలింగ్‌ భూములన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో వ్యవహరించి పేదలకు పట్టాలు, ఇళ్లు మంజూరు చేయాలని కోరారు.

భూ వివాదంపై సమగ్ర విచారణ..

మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ మాట్లాడుతూ.. గుడిసెల కూల్చివేతలు ఆపి పేదలకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డిని డిమాండ్‌ చేశారు. భూ వివాదంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. కాంగ్రెస్‌ నేతలే గతంలో గుడిసెలు వేయించి, ఇప్పుడు కూల్చివేతలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ర్యాలీని పోలీసులు ఎమ్మార్వో కార్యాలయం వద్ద అడ్డుకోవడంతో వినోద్‌కుమార్‌, వినయ్‌భాస్కర్‌ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. తమకు ప్రాణహాని ఉందని, గుడిసెలపైకి జేసీబీలు వస్తున్నాయని స్థానికురాలు నీరటి పావని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేసి భూ వివాదంపై సమగ్ర విచారణ జరిపి పేదలకు న్యాయం చేయాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>