కలం, వెబ్ డెస్క్: ఏపీలోని తిరుపతిలో కూటమి విజయోత్సవ సభ ఘనంగా ప్రారంభమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా “రెండేళ్ల నమ్మకం-అభివృద్ధి, సంక్షేమం” నినాదంతో సభ నిర్వహిస్తున్నారు.. చంద్రగిరి నియోజకవర్గం దామినేడు సమీపంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రి లోకేశ్, కూటమి నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. తొలుత సభను జ్యోతి ప్రజ్వలనతో సీఎం, డిప్యూటీ సీఎం ప్రారంభించారు. కూటమి 2 ఏళ్ల విజయోత్సవ సభలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నారా లోకేశ్ (Nara Lokesh) చెప్పులు విప్పి ‘ఓం నమో వేంకటేశాయ’ మంత్రం చదివి సభలో తన ప్రసంగం మొదలు పెట్టారు. సినిమాలో పవర్ స్టార్ అని.. రాజకీయాల్లో జనసేనాని అని కొనియాడారు. ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ అన్న పేర్కొన్నారు. తానకు సొంత అన్న లేని లోటును పవన్ కల్యాణ్ అన్న తీర్చారని చెప్పారు. ఇప్పుడున్న రాజకీయాల్లో విరాట్ కోహ్లీ మన చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. టీడీపీ, జనసేన, బీజేపీ.. అంతా ఒకే కుటుంబమని పేర్కొన్నారు. కూటమిలో చిన్నచిన్న సమస్యలు రావచ్చు, కానీ అందరం కూర్చొని పరిష్కరించుకోవాలని.. ఆ బాధ్యత మన అందరిపై ఉందని చెప్పారు.
ఇక సభావేదికగా వైసీపీపై లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ జెండా లేకుండా చేస్తామన్నారని.. కానీ ప్రజలే వైసీపీ జెండాలు పీకేశారని ఫైర్ అయ్యారు. వైసీపీ నేతలు రపరపా అంటే చూస్తూ ఊరుకోమని.. రెడ్‌బుక్ దాని పని అది చేసుకుంటూ పోతుందని చురకలు అంటించారు. జగన్ పేరులో జీ అంటే జెన్‌జీ కాదు, గొడ్డలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు సీసీడీ జబ్బు ఉందని.. సీసీడీ అంటే క్రెడిట్ చోరీ డిజార్డర్ అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. డీఎస్సీపై జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ తెచ్చిన కంపెనీలు.. ఆంధ్ర గోల్డ్, ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్ ( లిక్కర్ బ్రాండ్లు) అంటూ విమర్శించారు. తమ ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్రానికి గూగుల్, రాయల్ ఎన్‌ఫీల్డ్, ఫైటర్ జెట్ కంపెనీలు తీసుకొచ్చాయని కొనియాడారు. రూ.లక్ష కోట్లతో ‘మిషన్ రాయలసీమ’ ప్రాజెక్టు చేపట్టబోతున్నామని ప్రకటించారు.

