కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ నిర్మూలన, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాల నివారణపై (Anti Drug Campaign) అవగాహన కల్పించేందుకు వనపర్తి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కొత్తకోట పట్టణంలో 2కే రన్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఎస్పీ సునీతా రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కొత్తకోట చౌరస్తా వద్ద జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన అతిథులు, ఏటీఆర్ కన్వెన్షన్ వరకు నిర్వహించిన 2కే రన్‌లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రజలందరితో కలిసి యాంటీ డ్రగ్స్ ప్రతిజ్ఞ చేయించారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో రూపొందించిన బాల కార్మిక, బాల్య వివాహాల నిర్మూలన అవగాహన పోస్టర్లను ముఖ్య అతిథులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ మోడల్ స్కూల్ లో చదివిన విద్యార్థినికి ఇంటర్మీడియట్ లో అత్యుత్తమ మార్కులు వచ్చిన విద్యార్థినికి ముఖ్య అతిథులు సన్మానించారు.
ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి (MLA Madhusudan Reddy) మాట్లాడుతూ.. డ్రగ్స్ బారిన పడి ఎంతోమంది యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రగ్స్ నియంత్రణ విషయంలో అత్యంత సీరియస్‌గా ఉన్నారని, ఈగల్ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. డ్రగ్స్‌ను అరికట్టడం ప్రభుత్వంతో పాటు సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం అధికారులకు అందించాలని, సమాచారాన్ని గోప్యంగా ఉంచబడుతుందని హామీ ఇచ్చారు.
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం చివరి రోజున డ్రగ్స్ నిర్మూలనపై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషకరమన్నారు. డ్రగ్స్ అనే మహమ్మారి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చుట్టుపక్కల అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలపై పర్యవేక్షణ ఉంచి అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. వనపర్తి జిల్లాను పూర్తిగా డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సునీతా రెడ్డి మాట్లాడుతూ.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. యువత తెలియకుండానే డ్రగ్స్‌కు బానిసలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ సేవించేవారు, సరఫరా చేసేవారికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే 1908 నంబర్‌కు ఫోన్ చేసి తెలియజేయాలని, వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యా సంస్థలు, గ్రామాలు, కాలనీల్లో యాంటీ డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేసి డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాజేష్ మీనా, కొత్తకోట మున్సిపల్ చైర్ పర్సన్ అరుణ శ్రీనివాస్, వైస్ చైర్ పర్సన్ సునీత పల్లవి, మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రశాంత్, పోలీసు శాఖ అధికారులు, కొత్తకోట వాకింగ్ అసోసియేషన్ల సభ్యులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, యువత మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

