కలం, వెబ్ డెస్క్: ఏపీ శాసన మండలిలో వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ్యులు సభలో చర్చ జరుగుతున్నప్పుడు వాకౌట్ చేయడం సరికాదన్నారు. వైసీపీ సభ్యులు మొన్న ముందు తలుపు నుంచి వాకౌట్ చేశారని, నేడు వెనకాల తలుపు నుంచి వాకౌట్ చేస్తున్నారని విమర్శించారు. సభలో చెప్పేది వినేందుకు సభ్యులకు ఓపిక ఉండాలన్నారు. ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వం నిరంతర ప్రక్రియ అని చెప్పారని గుర్తు చేశారు. మరి అమరావతి ఎందుకు ఆపేశారని, అన్నా క్యాంటీన్లు ఎందుకు మూసివేశారని ప్రశ్నించారు.
ప్రభుత్వం చర్చకు సిద్ధమని, వినేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఇది ప్రజా ప్రభుత్వం అని, మేం పరదాలు కట్టుకొని తిరగడం లేదని సెటైర్లు వేశారు. విద్యా శాఖతో పాటు ప్రతి శాఖలో ప్రతి వారంలో ఒకరోజు ఖచ్చితంగా కమిషనర్ సంఘాలన్నింటిని కలుస్తారని, సమస్యలు ఏమున్నాయో తెలుసుకుంటామని, ఆ సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని కోరారు.

