ఉమ్మడి నల్లగొండలో సర్ టెన్షన్..! లీడర్ల భవితవ్యం మారేనా?

కలం, నల్లగొండ బ్యూరో : ఉమ్మడి నల్లగొండ (Nalgonda) జిల్లా రాజకీయాల్లో ‘సర్’ (SIR) తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తోంది. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 29,84,448 ఓటర్లలో కేవలం 27,00,391 ఓట్లు (90.48%) మాత్రమే డిజిటైజ్ కాగా, ఏకంగా 2,84,057 ఓట్లు (9.52%) అన్‌కలెక్టబుల్ జాబితాలోకి చేరిపోయాయి. తొలగింపునకు సిద్ధమైన భారీ ఓట్ల సంఖ్య అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపోటముల తలకిందులు చేసే పరిస్థితి తలెత్తనుంది. ఉమ్మడి జిల్లాలో అధికంగా అన్‌కలెక్టబుల్ ఓట్ల నమోదు దేవరకొండ, నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, భువనగిరి సెగ్మెంట్లలో ఉంది. దేవరకొండ 36,815 కాగా, నల్లగొండలో 31,890, మిర్యాలగూడలో 31,412 ఓట్లుగా తేలాయి.

అన్‌కలెక్టబుల్ ఓట్ల అసలు నిజాలివే..

బీఎల్ఓల ఇంటింటి సర్వేలో దాదాపు 3 లక్షల ఎన్యూమరేషన్ ఫారాలు లభించకపోవడం వెనక పలు సాంకేతిక, సామాజిక అంశాలు దాగి ఉన్నాయి. ప్రధానంగా ఒకే వ్యక్తికి ఒకే ఓటు అనే నిబంధనను ఈసారి కఠినంగా అమలు చేయడంతో డూప్లికేట్ ఓట్లకు అడ్డుకట్ట పడింది.దశాబ్దాలుగా హైదరాబాద్, ఇతర ప్రధాన నగరాల్లో నివాసముంటూ సొంత ఊరిలోనూ ఓటు హక్కును కొనసాగిస్తున్న ఓటర్లను ఆధార్, ఫీల్డ్ మ్యాపింగ్ ద్వారా గుర్తించడంతో చాలామంది తమ నింపేందుకు ఆసక్తి చూపలేదు.

దీనికితోడు జిల్లాలోని వివిధ మండలాల నుంచి ఉపాధి, వ్యాపార, ఉద్యోగ రీత్యా రాజధానితో పాటు ఇతర ప్రాంతాలకు కుటుంబాలతో శాశ్వతంగా వలస వెళ్లిన వారి ఇళ్లు తాళాలు వేసి ఉండటంతో ఫారాలు అందుబాటులోకి రాలేదు. మరోవైపు, మరణించిన ఓటర్లను ఏళ్ల తరబడి అధికారికంగా జాబితా నుంచి తొలగించకపోగా.. సర్ ద్వారా క్షేత్రస్థాయిలో గుర్తించి తొలగింపు జాబితాలోకి చేర్చారు. కొన్ని చోట్ల బీఎల్ఓలు ఇళ్లకు తాళాలు వేసి ఉన్నప్పుడు వెళ్లే సమయం లేక అలసత్వం వహించడంతో పాటు సమాచారం ఇవ్వడంలో పౌరులు సైతం కాలయాపనతో కూడా వేల సంఖ్యలో నిజమైన ఓటర్ల ఫారాలు అన్‌కలెక్టబుల్‌గా మిగిలిపోయాయి.

పట్టణాల్లోనే ఎక్కువగా ఓట్ల కోత

ఉమ్మడి జిల్లాలోని ఒక్కో సెగ్మెంట్ లో ఒక్క తరహాలో ఓట్ల కోత ఉంది. ప్రధానంగా పట్టణ నియోజకవర్గాలైన నల్లగొండ, సూర్యాపేట, మిర్యాలగూడ, భువనగిరిలో అన్‌కలెక్టబుల్ ఓట్ల శాతం ఏకంగా 11% నుంచి 13% వరకు నమోదైంది. వేరే ప్రాంతాలకు వెళ్లడం, డూప్లికేట్ ఓట్లు ఎక్కువగా ఉండటమే కారణంగా తెలుస్తోంది. గ్రామీణ ప్రాంత నియోజకవర్గాలైన దేవరకొండ, తుంగతుర్తి, నాగార్జునసాగర్, ఆలేరులో డిజిటలైజేషన్ 92% కంటే ఎక్కువ పూర్తయింది.

ఇక్కడి ఓటర్ల ఇళ్లు స్థిరంగా ఉండటంతో అన్‌కలెక్టబుల్ శాతం 8% లోపే పరిమితం కావడం గమనార్హం. అయితే ప్రతి అసెంబ్లీ స్థానంలో సగటున 15వేల నుంచి 35వేల వరకు ఓట్లు చెల్లుబాటు కాకుండా పోతుండటం ప్రధాన పార్టీల్లో టెన్షన్ పెంచుతోంది. ఫలితంగా గత ఎన్నికల్లో 5వేల నుంచి 10వేల ఓట్లతో గెలిచిన నేతలకు పరీక్షగా మారింది. మరోవైపు ఎన్నికల రోజున హైదరాబాద్ వంటి ప్రాంతాల నుంచి బస్సులు, కార్లలో సొంతూళ్లకు రప్పించి ఓట్లు వేయించుకునే పద్ధతికి ముగింపు పడనుంది. ఇక కోల్పోయిన నిజమైన ఓట్లను తిరిగి నమోదు చేయించే పార్టీ కేడర్ బలంపైనే గెలుపు ఆధారపడి ఉంటుంది.

అక్టోబర్ 15 వరకు మార్చే చాన్స్

అన్‌కలెక్టబుల్ జాబితాలోని ఓటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎన్నికల యంత్రాంగం స్పష్టం. ఆగస్టు 17న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ. అర్హులైన పౌరులు తమ పేర్లు తొలగింపు జాబితాలో ఉంటే, ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 15 వరకు నిర్వహించే క్లెయిమ్‌ల గడువులో ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకుని తిరిగి ఓటు హక్కును పొందవచ్చు. అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితా విడుదల కానుంది. వచ్చే రెండు నెలల సమయాన్ని ఏ రాజకీయ పార్టీ సమర్థవంతంగా వాడుకుని, తమ అనుకూల ఓట్లను తిరిగి నమోదు చేయించుకుంటుందో చూడాలి.

ఉమ్మడి జిల్లాలో నమోదైన ఓట్ల వివరాలు

జిల్లా పేరు   మొత్తం ఓటర్లు     డిజిటైజ్ అయిన ఓట్లు       అన్‌కలెక్టబుల్ ఫారాలు

భువనగిరి     4.60 లక్షలు      94.31%(4.33 లక్షలు)        26,219 (5.69%)
సూర్యాపేట  10.20 లక్షలు     90.45%(9.23 లక్షలు)        96,258 (9.55%)
నల్లగొండ     15.04 లక్షలు     89.51%(13.44 లక్షలు)      1,59,074 (10.49%)
మొత్తం        29,84,448        90.48%(27 లక్షలు)          2,84,057 (9.52%)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>