నల్గొండ జిల్లాకు శాపంగా మంత్రి కోమటిరెడ్డి!: వర్షిత్ రెడ్డి

కలం, నల్గొండ : జిల్లాలో ధాన్యం కొనుగోలు (Nalgonda Paddy Procurement) కేంద్రాలకు రైతులు పంట తీసుకొచ్చి నెల రోజులు గడుస్తున్నా పూర్తిస్థాయిలో కాంటాలు ప్రారంభం కాకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగమణి వర్షిత్ రెడ్డి అన్నారు. ఆదివారం అర్జలబావి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి రైతులతో మాట్లాడారు.ఈ ఖరీఫ్ సీజన్‌లో ఎల్‌నినో ప్రభావం.. వర్షాభావ పరిస్థితులు,సరైన విద్యుత్ సరఫరా ఇవ్వకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఎన్నో కష్టనష్టాలు భరించి పండించిన పంటను అమ్ముకుందామని కేంద్రాలకు ధాన్యం తీసుకొస్తే, రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోందన్నారు.

జిల్లాలో ఎంత విస్తీర్ణంలో వరి సాగు అవుతుంది, ఎంత దిగుబడి వస్తుంది, ఎన్ని కేంద్రాలు కావాలి, తరలింపు ఏర్పాట్లు ఎలా అనే కనీస అంచనా కూడా అధికారులకు లేదని వర్షిత్ రెడ్డి అన్నారు. ఇది ప్రభుత్వ ముందుచూపు లేమికి నిదర్శనమని విమర్శించారు. జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చొరవ చూపకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, నల్గొండ జిల్లాకు ఆయన శాపంగా మారారని విమర్శించారు.

నేడు కురుస్తున్న అకాల వర్షాలు, ముసురు కారణంగా కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం మళ్లీ తడిసిపోతోందని.. కనీసం టార్పాలిన్లు కూడా ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. తడిసిన ధాన్యంతో నాణ్యత తగ్గి రైతుకు మరింత నష్టం జరుగుతోందన్నారు.కేంద్ర ప్రభుత్వం MSP ఇస్తూ.. సేకరణకు సహకారం అందిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు, తరలింపులో విఫలమవుతోందని ఆరోపించారు. ”నెల రోజులుగా ఎదురుచూస్తున్న రైతుల ధాన్యానికి తక్షణమే కాంటాలు వేయాలి.కొనుగోలు చేసిన ధాన్యాన్ని జాప్యం లేకుండా మిల్లులకు తరలించాలి..  అకాల వర్షాల నుంచి కాపాడేందుకు టార్పాలిన్లు, రక్షణ ఏర్పాట్లు చేయాలి.  గన్నీ సంచులు, హమాలీలు, రవాణా వాహనాలు అందుబాటులో ఉంచాలి. తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతుకు నష్టం జరగకుండా చూడాలి. ప్రతి కేంద్రం వద్ద అధికారుల పర్యవేక్షణ పెంచాలి. రైతులను ఆదుకోవాల్సిన సమయంలో రాజకీయాలు కాదు బాధ్యత ముఖ్యమని, రైతు కష్టాన్ని ప్రచారానికి పరిమితం చేయకుండా సకాలంలో కొనుగోలు చేసి న్యాయం చేయాలి” అని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీజేపీ రైతుల పక్షాన ప్రజా ఉద్యమాలకు సిద్ధమవుతుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పోతేపాక లింగస్వామి, బీజేపీ నాయకులు వంగూరి రాఖీ, పాలకూరి రవిగౌడ్, మంగలిపల్లి కిషన్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>