కలం, ఖమ్మం బ్యూరో: కేంద్ర ప్రభుత్వం 2027లో చేపట్టనున్న జనగణనలో బీసీ కుల గణనను తప్పకుండా చేపట్టాలని బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో నాయకులు (Khammam BC Leaders) గట్టిగా డిమాండ్ చేశారు. ఆదివారం ఖమ్మంలోని మున్నూరుకాపు కార్యాలయంలో జిల్లా కార్యదర్శి తాటి వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. బీసీ కులాలకు సంబంధించిన సరైన, అధికారిక జనాభా లెక్కలు అందుబాటులో లేకపోవడం వల్ల విద్య, వైద్య, ఉద్యోగ తదితర కీలక రంగాలలో తగిన రిజర్వేషన్లు అందక బీసీ కులాలు సామాజికంగా, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రాబోయే 2027లో జరిగే జనాభా లెక్కల సేకరణలో ప్రతి బీసీ ఉపకులాలకు సంబంధించిన ప్రత్యేక కుల గణన చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంపై తగిన ఒత్తిడి తెచ్చేందుకు భవిష్యత్తులో దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులను కలిసి పెద్దఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర నాయకులు శింగు నర్సింహారావు, జిల్లా అధ్యక్షులు మేకల శ్రీనివాసరావు, బీసీ జేఏసీ ఛైర్మన్ పాల్వంచ రామారావు, తదితరులు పాల్గొన్నారు.

