కలం, మహబూబ్నగర్ బ్యూరో: అసంఘటిత రంగంలోని కార్మికులకు సమగ్ర కార్మిక చట్టం రూపొందించాలని సీఐటీయూ (CITU) డిమాండ్ చేసింది. ఆదివారం హమాలీల జనరల్ బాడీ సమావేశం హమాలీ భవన్లో గోనెల ఆంజనేయులు, గోనెల నాగరాజుల అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి హాజరై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హమాలీలకు సమగ్ర చట్టం రూపొందించడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయని, కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మికుల పట్ల వివక్ష చూపుతున్నదని, చట్టాలు చేయడంలోనూ వేతనాలు పెంచడంలోనూ కార్మికుల సంక్షేమం గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. లేబర్ కోడ్లు తెచ్చి ఉన్న హక్కులను హరిస్తున్నదని, లక్షలాది మంది హమాలీలు లోడింగ్, అన్లోడింగ్ పనులు చేస్తూ జీవనం గడుపుతున్నారని ఆయన తెలిపారు.
50 సంవత్సరాలు దాటిన వారందరూ నడుము వంగి వెన్నెముక పనిచేయక, కాళ్లకు కాయలు కాసి, వీపు వెన్నెముక దెబ్బతిని అనారోగ్యం పాలవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాలలో వ్యవసాయ ధాన్యము, పట్టణాల్లో అనేక రకాల లోడింగ్ అన్లోడింగ్ పనులు చేస్తున్న వారికి ప్రమాదాలు జరిగిన ప్రభుత్వ నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందడం లేదని లేదన్నారు. అసంఘటిత రంగంలోని అమాలీలకు సమగ్ర చట్టం రూపొందించి ప్రమాద బీమా, సంక్షేమ చర్యలు, పిల్లల చదువులకు ఆర్థిక తోడ్పాటు అందించాలని డిమాండ్ చేశారు. హమాలీలకు ఇందిరమ్మ ఇండ్లు, ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆదుకోవాలని, కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. మరోవైపున యాజమాన్యాలు ఇచ్చే డబ్బులు కూడా సక్రమంగా ఇవ్వడం లేదని, మాల్స్ ,పెద్దపెద్ద షాపుల్లో, కంపెనీల్లో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన పోలీసుల కార్మికులను తీసుకొచ్చి వలస కార్మికులతో అతి తక్కువ జీతాలతో పని చేయించుకుని, స్థానికులకు ఉపాధి కల్పించకుండా, వారికి కనీస సౌకర్యాలు కల్పించకుండా యాజమాన్యాలు దోపిడీ పద్ధతులకు పాల్పడుతున్నాయని ఆయన విమర్శించారు. ప్రమాదాలు గురైన హమాలీలకు ఐదు లక్షల నష్టపరిహారం ఇవ్వాలని, వైద్య సహాయం అందించాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే హమాలీలకు సమగ్ర చట్టం రూపొందించాలని,రెండు సంవత్సరాలకోసారి అగ్రిమెంట్ రేట్లు పెంచి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అగ్రిమెంట్లు చేయాలని, స్థానికులకే లోడింగ్ అన్లోడింగ్ పనులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గోనెల నరసింహులు, గోనెల గోవర్ధన్, గంజి లక్ష్మణ్, గోనెల నాగరాజు, చంద్రయ్య, బాలయ్య, బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.

