ధాన్యం కొనుగోళ్లు షురూ.. రైతులు ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!

కలం, నల్లగొండ : రైతులు తాము పండించిన ధాన్యాన్ని సరిగ్గా ఆరబెట్టి, నాణ్యతా ప్రమాణాలు పాటించి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని నల్లగొండ జిల్లా కలెక్టర్‌ బి. చంద్రశేఖర్‌ పిలుపునిచ్చారు. సోమవారం నల్గొండ (Nalgonda) జిల్లా కేంద్రం పరిధిలోని ఆర్జాలబావి వద్ద ఏర్పాటు చేసిన ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని (Paddy Procurement Centre) మున్సిపల్‌ కార్పొరేషన్ మేయర్‌ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డితో కలిసి కలెక్టర్ ఘనంగా ప్రారంభించారు.

తేమ 17 శాతంలోపే ఉండాలి: కలెక్టర్

ఈ సందర్భంగా కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొనుగోలు కేంద్రాలకు తెచ్చే ధాన్యంలో తేమ శాతం 17 లోపు ఉండేలా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నాణ్యమైన ధాన్యానికి మద్దతు ధరతో పాటు ప్రభుత్వం ప్రకటించిన బోనస్‌ కూడా సులభంగా అందుతుందన్నారు. గ్రేడ్‌–ఏ రకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,461, సాధారణ రకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,441 మద్దతు ధరగా ప్రభుత్వం నిర్ణయించిందని, సన్న రకం ధాన్యం పండించిన రైతులకు మద్దతు ధరతో పాటు క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ అందజేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.

జిల్లా వ్యాప్తంగా 399 కొనుగోలు కేంద్రాలు

జిల్లావ్యాప్తంగా మొత్తం 399 ధాన్యం కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా సుమారు 6.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని అధికారుల అంచనాగా ఉందన్నారు. ఎల్‌నినో ప్రభావం, వాతావరణ మార్పుల నేపథ్యంలో రైతులు కేవలం వరిపైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలని కలెక్టర్‌ చంద్రశేఖర్‌ కోరారు.

మార్కెట్‌లో సన్న ధాన్యంతో పాటు కూరగాయలు, ఉద్యానవన, ఆరుతడి పంటలకు అధిక డిమాండ్ ఉందని, తక్కువ నీటితో పండే పంటలను సాగు చేయడం ద్వారా రైతులు అధిక లాభాలు గడించవచ్చని స్పష్టం చేశారు. ప్రతి మంగళవారం, శుక్రవారం రోజుల్లో రైతు వేదికలలో నిర్వహించే రైతు నేస్ కార్యక్రమాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, సమిష్టి వ్యవసాయం, ప్రత్యామ్నాయ సాగుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.

దళారులను నమ్మి మోసపోవద్దు: మేయర్

నల్లగొండ మున్సిపల్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. గత ఖరీఫ్ సీజన్ మాదిరిగానే ఈసారి కూడా రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ధైర్యాన్నిచ్చారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని విజ్ఞప్తి చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>