కలం, ఖమ్మం బ్యూరో: చారిత్రక ప్రాధాన్యత కలిగిన నేలకొండపల్లి బౌద్ధ స్తూపానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) స్పష్టం చేశారు. ఈ ప్రాంత అభివృద్ధికి ఎంత ఖర్చయినా వెనుకాడేది లేదని అన్నారు.
పాలేరు నియోజకవర్గ పరిధిలోని నేలకొండపల్లిలో గల మూడో శతాబ్దపు చారిత్రక బౌద్ధ స్తూపాన్ని, దాని పరిసర ప్రాంతాలను అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు ఆయన ప్రకటించారు. సోమవారం నేలకొండపల్లిలో పర్యాటక సదుపాయాల కల్పన, బౌద్ధ స్థల సంరక్షణ, పునరుద్ధరణ పనులకు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ తో కలిసి ఆయన ఘనంగా శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. సుమారు 50-55 సంవత్సరాల క్రితం వెలుగులోకి వచ్చిన ఈ బౌద్ధ స్తూపం దేశంలోని అత్యంత పెద్ద బౌద్ధ స్తూపాలలో ఒకటిగా నిలిచిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులు ప్రారంభమైనప్పటికీ అవి అసంపూర్తిగా మిగిలిపోయాయని గుర్తుచేశారు.
స్తూపం చుట్టూ ఉన్న ఒకటిన్నర కిలోమీటరు పరిధిలో గతంలో పురావస్తు శాఖ తవ్వకాలు జరపగా ఎన్నో పురాతన వస్తువులు లభ్యమయ్యాయని అన్నారు. అయితే స్థానికంగా భద్రపరిచే వసతులు లేకపోవడంతో వాటిని హైదరాబాద్ మ్యూజియానికి తరలించాల్సి వచ్చిందని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధ మతస్థులు, స్థానికుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని త్వరలోనే బౌద్ధ కట్టడాలపై అవగాహన ఉన్న ప్రముఖ నిపుణులు, అధికారులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు. బౌద్ధులకు ఇది ప్రధాన ఆకర్షణగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర హెరిటేజ్ శాఖ డైరెక్టర్ కుతాడి అర్జున్ రావు, హెరిటేజ్ శాఖ ఉప సంచాలకులు నాగరాజు, ఖమ్మం ఆర్డీవో ఎన్. శ్రీనివాస్, తహశీల్దార్ రాంప్రసాద్, కన్సల్టెంట్ శ్రీనివాస్, టూరిజం డీఈ రామకృష్ణ, జిల్లా టూరిజం అధికారి సుమన్ చక్రవర్తి, స్థానిక సర్పంచ్ శీలం వెంకటలక్ష్మి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

