కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో తుమ్మడిహెట్టి (Tummidihatti Barrage) వద్ద కొత్తగా నిర్మించ తలపెట్టిన బ్యారేజీ నిర్మాణంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) మధ్య జరిగిన సమావేశం ముగిసింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య జరిగిన ఉన్నత స్థాయి సమావేశం సానుకూల వాతావరణంలో ముగిసింది. ఉత్తర తెలంగాణ, ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన ప్రాంతాల సాగునీరు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరగా, ఈ విషయంలో ప్రాధాన్యత కలిగిన తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సానుకూలంగా స్పందించారు.
ఈ మేరకు గతంలో కుదిరిన 148 మీటర్ల ఎత్తు ఒప్పందాన్ని పున:పరిశీలించేందుకు మహారాష్ట్ర సీఎం సుముఖత వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బ్యారేజీ ఎత్తును 152 మీటర్లకు పెంచే ప్రతిపాదనపై ఇరువర్గాలు కీలక చర్చలు జరిపాయి. సరిహద్దు ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ఎంతో కీలకమైన ఈ ప్రాజెక్టు తదుపరి కార్యాచరణ కోసం స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసేందుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి.
ఇందులో భాగంగా బ్యారేజీ ఎత్తు, నీటి లభ్యత, ముంపు ప్రభావంతో పాటు పరిహారం, ఇతర సాంకేతిక అంశాలపై అధ్యయనం చేయడానికి రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శులతో ఒక ప్రత్యేక అధికారుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సెంట్రల్ వాటర్ కమిషన్ నివేదికలు, కాంటూర్ మ్యాపుల ఆధారంగా సమగ్ర పరిశీలన జరిపి తుది నిర్ణయాలు తీసుకోనుంది.
అయితే బ్యారేజీ (Tummidihatti Barrage) ఎత్తు పెంపు వల్ల మహారాష్ట్ర భూభాగానికి ఏర్పడే ముంపునకు తగిన పరిహారాన్ని చెల్లిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇదే సమావేశంలో ప్రాంతీయ అభివృద్ధి సహకారంతో పాటు పారిశ్రామిక వేదికలను పంచుకోవడంపై కూడా ఇరువురు సీఎంలు చర్చించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో రాబోయే డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ‘తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’ కు ముఖ్య అతిథిగా హాజరుకావాలని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ఆహ్వానించారు.
Also Read : పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి భారీ ఊరట!
Follow Us On : WhatsApp

