పేదల ఇళ్ల కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి

​కలం, ఖమ్మం బ్యూరో : పేదల సొంత ఇంటి కల నెరవేర్చడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) స్పష్టం చేశారు. సోమవారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి రైతు వేదికలో మండల లబ్ధిదారులకు రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ తో కలిసి మంత్రి పంపిణీ చేశారు. ​ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. గతంలో పేదలు ఏ ప్రభుత్వ హయాంలోనైనా ఇల్లు కట్టుకోగలమా అని సందేహించేవారని, కానీ నేడు పేదల కలలు నిజమవుతున్నాయని తెలిపారు.

అర్హులైన ప్రతి పేదవాడికి కులం, మతం, పార్టీ చూడకుండా ఇందిరమ్మ ఇళ్లు అందించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు పొంగులేటి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో 4.5 లక్షల ఇళ్లు ఇవ్వగా, రెండో విడతలో 2.5 లక్షల ఇళ్లు ఇస్తున్నామన్నారు. అలాగే హైదరాబాద్‌ పట్టణానికి అదనంగా ఒక లక్ష ఇళ్లను మంజూరు చేసి, మొత్తం 8 లక్షల ఇళ్లను పేదలకు అందిస్తున్నామని వెల్లడించారు. ​నేలకొండపల్లి మండలంలో మొదటి విడత కింద మంజూరైన 648 ఇళ్లలో సుమారు 620 ఇళ్లు పూర్తయ్యాయని, వివిధ కారణాల వల్ల మిగిలిన ఇళ్లను కూడా త్వరలోనే పూర్తి చేయాలని అధికారులను మంత్రి (Minister Ponguleti) ఆదేశించారు.

రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఫైనల్ బిల్లులన్నింటినీ రాబోయే 10 రోజుల్లోగా లబ్ధిదారుల ఖాతాల్లో ఎలాంటి లంచాలకు తావు లేకుండా జమ చేసే బాధ్యత ప్రభుత్వానిదేనని మంత్రి స్పష్టం చేశారు. ​పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలను ఎక్కడా ఆపకుండా, అభివృద్ధిని కూడా జోడెడ్ల వలె సమానంగా ముందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు. ​ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, కరెంటు, నీటి సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో రైతన్నలు నష్టపోకూడదనే ఉద్దేశంతో రెండో పంట వేయవద్దని రైతాంగానికి మంత్రి విజ్ఞప్తి చేశారు.

​అంతకుముందు మంత్రి నేలకొండపల్లి మండలం అనాసాగరం నుండి పమ్మి వరకు 2.5 కిలోమీటర్ల మేర 2.80 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న బిటి రోడ్డు నిర్మాణ పనులకు పొంగులేటి శంకుస్థాపన చేశారు. ​ఈ కార్యక్రమంలో హౌజింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, పీఆర్ ఎస్ఈ వెంకట్ రెడ్డి, ఖమ్మం ఆర్డీవో ఎన్. శ్రీనివాస్, నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, మండల ఎంపీడీవో ఎర్రయ్య, తహశీల్దార్ రాంప్రసాద్, స్థానిక సర్పంచ్ శీలం వెంకటలక్ష్మి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>