కలం, నల్లగొండ బ్యూరో: నల్లగొండ (Nalgonda) మున్సిపల్ కార్పొరేషన్లో పూర్తి స్థాయి కమిషనర్ లేకపోవడంతో పాలన పూర్తిగా స్తంభించింది. కమిషనర్ బి. శరత్ చంద్ర పదవీ విరమణ చేసినప్పటి నుంచి ఆ పోస్టు ఖాళీగానే ఉండటంతో పౌర సేవలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రెండు వారాలకు పైగా యాక్టివ్ కమిషనర్ లేకపోవడంతో ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్ల జారీ నిలిచిపోగా, వివిధ పరిపాలనా ఫైళ్లు కూడా పెండింగ్‌లో పడిపోయాయి.
జిల్లా కేంద్రంగా ఉన్న నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో(Municipal Corporation) రెండు లక్షలకు పైగా జనాభా, సుమారు 45 వేల ఇళ్లు ఉన్నాయి. కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ అయిన తర్వాత విలీన గ్రామాలతో పరిధి మరింత విస్తరించింది. రోజూ 300 నుంచి 500 మంది వరకు ప్రజలు జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, భవన నిర్మాణ అనుమతులు, ఆస్తి పన్ను మ్యుటేషన్లు, కొత్త నీటి కనెక్షన్లు తదితర పనుల కోసం మున్సిపల్ కార్యాలయాన్ని ఆశ్రయిస్తుంటారు. అయితే ప్రస్తుతం అధికారుల కుర్చీలు ఖాళీగా ఉండటంతో ప్రజలు పనులు కాక నిరాశతో వెనుదిరుగుతున్నారు.
సర్టిఫికెట్ల జారీపై ప్రభావం
ప్రస్తుతం సర్ (SIR) ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలకు డిమాండ్ పెరిగింది. సంక్షేమ పథకాల లబ్ధి, లీగల్ వారసత్వ ప్రక్రియలు, ఇతర అధికారిక అవసరాలకు ఈ సర్టిఫికెట్లు కీలకం. వీటిపై కమిషనర్ డిజిటల్ సంతకం తప్పనిసరి కావడంతో పోస్టు ఖాళీగా ఉండటం వల్ల సర్టిఫికెట్ల జారీ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పెండింగ్‌లో ఫైళ్లు.. దెబ్బతిన్న పారిశుధ్యం
కమిషనర్ లేకపోవడంతో సర్టిఫికెట్ల జారీ మాత్రమే కాకుండా కార్పొరేషన్ బడ్జెట్ విడుదల, అభివృద్ధి పనులు, పరిపాలనా ఫైళ్ల ఆమోదం కూడా నిలిచిపోయింది. వర్షాకాలంలో అత్యంత కీలకమైన దోమల నివారణ చర్యలు, డ్రైనేజీల పూడికతీత, పారిశుధ్య నిర్వహణ పనులు సైతం ఆశించిన స్థాయిలో సాగడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్చార్జ్ అధికారులకు పూర్తి స్థాయి అధికారాలు లేకపోవడంతో కీలక నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి నెలకొంది.
వెంటనే కమిషనర్‌ను నియమించాలని డిమాండ్
ఒక అధికారి పదవీ విరమణకు ముందే ప్రత్యామ్నాయ నియామకం చేపట్టాల్సి ఉండగా, రెండు వారాలుగా కార్పొరేషన్‌ను పూర్తి స్థాయి కమిషనర్ లేకుండా కొనసాగించడం ప్రభుత్వ పరిపాలనా వైఫల్యానికి నిదర్శనమని ప్రజా సంఘాలు విమర్శిస్తున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కాలయాపన చేయకుండా వెంటనే పూర్తి స్థాయి మున్సిపల్ కమిషనర్‌ను నియమించి పౌర సేవలను గాడిలో పెట్టాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

